ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై నిలదీసిన ఎంపీ వినోద్

– ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై నిలదీసిన ఎంపీ వినోద్.. తృణమూల్, కాంగ్రెస్ మద్దతు
– ఏపీ మండలి సభ్యుల సంఖ్య 58కి పెంచుతూ బిల్లు.. సీట్లు పెంచుకుంటే అభ్యంతరం లేదన్న వినోద్
– బిల్లుపై ఉభయ రాష్ర్టాల అభిప్రాయం పొందాలని వ్యాఖ్య.. అన్ని అంశాలూ పరిష్కరించాలని డిమాండ్
– విభజన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. మరో బిల్లును కూడా తెస్తాం: హోం మంత్రి రాజ్‌నాథ్ వివరణ
– రాజ్యసభలోనూ నిరసన తెలిపిన ఎంపీలు.. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీ హన్మంతరావు

MP Vinod

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణచేసే బిల్లును టీఆర్‌ఎస్ సహా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. బిల్లును ప్రవేశపెట్టరాదని డిమాండ్ చేయడంతోపాటు ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవడంతోపాటు అన్నింటికీ కలిపి ఒకే సవరణ బిల్లును సమగ్రంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎంపీలు వ్యతిరేకించారు.

ఏపీ శాసనమండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి వీలుగా ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ రెండు రోజుల ముందుగానే రూల్-72 కింద లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో విధిగా ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుగానే ఈ నోటీసుపై చర్చ జరగాల్సి ఉంది.

ఇందులో భాగంగా బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు వినోద్ ఇచ్చిన నోటీసుపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, సవరణ బిల్లు విషయంలో కేంద్రం రాజ్యాంగపరంగా కొన్ని నిబంధనలను పాటించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా మారిన ఏపీ విభజన చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలన్నా విధిగా ఆ ముసాయిదా ప్రతిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల శాసనసభలు, శాసనమండళ్ళకు పంపాల్సి ఉంటుందని, అక్కడి నుంచి అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కానీ రాష్ట్రపతి ఆమోదం లేదని, ఆయన కూడా ఈ రెండు రాష్ర్టాలకు ఈ బిల్లు ముసాయిదా ప్రతులను పంపలేదని అన్నారు. తప్పనిసరిగా రెండు రాష్ర్టాలతోనూ చర్చిస్తామని, రెండు రాష్ర్టాల ఎంపీలతోనూ మాట్లాడుతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గతంలో ఈ అంశం గురించి మాట్లాడుతూ చెప్పారని వినోద్ గుర్తు చేశారు.
ఇప్పుడు అందుకు విరుద్ధంగా సభలో బిల్లును కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలపై ఆ రెండు రాష్ర్టాలతోనూ చర్చించిన తర్వాతనే తగిన సవరణలు చేస్తామని చాలా స్పష్టమైన ప్రకటనను వెంకయ్యనాయుడు చేశారని, ఆచరణలో భిన్నంగా జరుగుతున్నదని అన్నారు. ఎంపీలుగా తామంతా కూడా ఇదే విధమైన చర్చల ప్రక్రియ జరుగుతుందని, సవరణల బిల్లులోని అంశాలను తమకు వివరిస్తారని భావించామని, సమగ్రమైన బిల్లును ప్రవేశపెడుతుందని భావించామని చెప్పారు.

నిజానికి రెండు రాష్ర్టాలూ కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయని, అవన్నీ కూడా బిల్లును రూపొందించే ముందు ప్రస్తావనకు వస్తాయని అనుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వినోద్ స్పష్టం చేశారు. అది జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. అది ఆ రాష్ర్టానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టంచేశారు. అయితే ఇరు రాష్ర్టాలూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, పలు ఇబ్బందులు పడుతున్నాయని, వాటి గురించి ఎలాంటి చొరవ తీసుకోని కేంద్రం కేవలం మండలి సభ్యుల సంఖ్య పెంపుకు సంబంధించి మాత్రమే బిల్లును రూపొందించి, మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడంపైనే తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు.

గత కేంద్రం అనేక అంశాల్లో లోతుగా చర్చించకుండానే నిర్ణయం తీసుకుని చట్టాన్ని ఆమోదించిందని వెంకయ్యనాయుడు చేసిన ప్రస్తావనను వినోద్ గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఏ అంశాన్నీ పట్టించుకోకుండా కేవలం ఒక్క అంశానికి మాత్రమే పరిమితమై సవరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. వాస్తవానికి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల పేరుతో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారని, ఈ మండలాల్లోని గ్రామాల్లో హెచ్చుశాతం మంది ప్రజలు గిరిజనులేనని చెప్పారు. ఈ గ్రామాలకు విద్యుత్ సరఫరా గురించి కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వమే రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉన్నప్పటికీ బాధ్యతతో విద్యుత్ అందిస్తున్నదని వినోద్ గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రెండు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను రెండు రాష్ర్టాలతో చర్చించి సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టాలని, అప్పటివరకు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. భవిష్యత్తులో రెండు రాష్ర్టాల మధ్య ఇబ్బందులు లేనివిధంగా సమగ్రమైన బిల్లు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని వినోద్ నొక్కి చెప్పారు.

సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి ఉద్దేశించిన ఏకైక అంశంతో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టడానికి బదులుగా అన్ని వివాదాస్పదమైన అంశాలను లోతుగా అధ్యయనం చేసి, ఈ రెండు రాష్ర్టాలతో చర్చించి సమగ్రమైన బిల్లును పెట్టి ఉండాల్సింది. కానీ ఏం తొందరొచ్చిందని, ఇప్పుడు ఆ అంశానికి మాత్రమే పరిమితమై బిల్లును ప్రవేశపెడుతున్నారు? నిజంగా నాకైతే అర్థం కావడం లేదు. చాలా అసమగ్రంగానూ, తొందరపాటుతోనూ ప్రవేశపెట్టే ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే ఆయన తన వాదనను వినిపించుకునేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. ముందుగా నోటీసు ఇవ్వలేదని, అలాంటప్పుడు మాట్లాడడానికి సమయం సరిపోదని సున్నితంగా ఆయన ప్రయత్నాన్ని స్పీకర్ నిరాకరించారు. ఖర్గే మాత్రం ముందుగా నోటీసు ఇవ్వని కారణంగానే ఇప్పుడు ముందస్తు అనుమతి కోరుతున్నానని, ఈ బిల్లుపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని అన్నారు.

రాజ్యసభలోనూ బిల్లుపై వ్యతిరేకత
రాజ్యసభలోనూ ఈ బిల్లుపై కాంగ్రెస్ సభ్యులనుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ ఎంపీ వీ హన్మంతరావు వెల్‌లోకి దూసుకెళ్ళి తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన అనేక అంశాలు అపరిష్కృతంగా ఉంటే కేవలం ఒక్క అంశానికి మాత్రమే పరిమితమై బిల్లును పెట్టడం సమంజసం కాదని అన్నారు. యుపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు రావాల్సిన అన్ని హక్కులపై కేంద్రం ఆలోచించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి విద్యుత్ సమస్యపైగానీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ గురించిగానీ, కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ప్రత్యేక ఆర్థిక సాయం గురించిగానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

మరో బిల్లు కూడా తెస్తాం
ఏపీ విభజన చట్టానికి సవరణలు చేసే బిల్లును టీఆర్‌ఎస్ సహా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలుకూడా వ్యతిరేకించడంతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు సమగ్రమైనదిగానే తాము భావిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ విషయంలో కేంద్రం ఆలోచిస్తూ ఉన్నదని అన్నారు. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత తమపైనే ఉన్నదని చెప్పారు. ఇందుకోసం ఇరు రాష్ర్టాలతో మాట్లాడిన తర్వాత మరో బిల్లును కూడా ప్రవేశపెడతామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి అవసరమైన చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ వ్యతిరేకించడంతోపాటు ఈ బిల్లు ఏ విధంగా సమగ్రమైనది కాదో రూల్-72 కింద వివరించిన నేపథ్యంలో హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.