అన్యాయం చేస్తే సహించం

-కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టాలి
-త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తాం
-సమాన పనికి సమాన వేతనం ఉండాలి: నాయిని
-హోం, కార్మిక మంత్రిని సన్మానించిన కార్మిక సంఘాలు

Naini Narsimha reddy

కార్మికులకు అన్యాయం చేస్తే ఎంతటి కంపెనీనైనా వదిలిపెట్టబోనని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. చట్టాలను అతిక్రమించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, కార్మికులకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒకప్పటి కార్మిక నేత, ప్రస్తుత కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీఎన్టీయూసీ, టీఆర్‌ఎస్‌కేవీ సంఘాలు మంగళవారం ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ కార్మిక చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించి త్వరలో పాలకమండలిని నియమిస్తామన్నారు.

ఈ నెల 15న అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. కంపెనీల్లో శ్రమ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న చట్టాలను అమలు చేస్తే కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకువస్తాం. కార్మికులను ప్రోత్సహిస్తే కంపెనీలు లాభాల్లోకి వస్తాయి. దీంతో కార్మికులకు కూడా బోనస్ వస్తుంది అని మంత్రి పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను కూడా పరిష్కరిస్తామని, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రయత్నిస్తామని నాయిని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం అందించేందుకు కృషి చేస్తామని, ఔట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. కార్మిక శాఖలో ఉన్న ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు.