అంతసీను లేదు! సెక్షన్ 8 చెప్పిందేమిటి?

-గవర్నర్‌కు ఉన్నది బాధ్యతలే.. అధికారాలు కావు..
-వాటిని అవసరమైతేనే వినియోగించాలి
-తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించడం తప్పనిసరి
-గవర్నర్‌కు ఇచ్చింది బాధ్యతలే…
-అసలు బిల్లులో కనపడని ఉమ్మడి పోలీస్ బోర్డు
-చంద్రబాబు లేఖకు వంత పాడుతున్న కేంద్ర ప్రభుత్వం
-గవర్నర్ పాలనపై సీమాంధ్రుల పగటి కలలు

KTR

పచ్చమూకల ప్రచార పటాటోపంలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల అక్రమ ఆస్తుల రక్షణే ధ్యేయంగా వారు ముందుకు తెచ్చిన విభజన చట్టంలోని సెక్షన్- 8 పస ఏమిటో తేలిపోయింది. ఉమ్మడి రాజధానిలో పోలీసుశాఖను పూర్తిగా గవర్నర్‌కు అప్పగించాలని విభజన చట్టంలో ఉందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదన పచ్చి అబద్ధమని తేలిపోయింది.

పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న హైదరాబాద్‌లో సర్వం గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. పునర్వవ్యవస్థీకరణ బిల్లులోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ చేతిలో ఉండాలంటూ చంద్రబాబు చేసిన వాదన అంతా కుట్రపూరితమేనని రుజువైంది. ఎందుకంటే సెక్షన్ 8లో ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థను గానీ, శాంతి భద్రతలను గానీ ఏకపక్షంగా గవర్నర్‌కు అప్పగించాలని లేదు. అయినా సీమాంధ్ర పెట్టుబడిదారులు, మీడియా మాత్రం సెక్షన్ -8 కింద గవర్నర్ సర్వాధికారి అంటూ విషప్రచారం చేస్తున్నారు. అత్యున్నతమైన పార్లమెంట్ రూపొందించిన చట్టాన్నే అపహస్యం చేస్తున్నారు.

బాధ్యతలకు అధికారాలకు తేడా తెలియదా?..
ఈ సెక్షన్ చెప్పిందల్లా గవర్నర్‌కు కొన్ని బాధ్యతలున్నాయనే. అధికారాలున్నాయని కాదు. రెస్పాన్సిబిలిటీ అనే పదానికి అర్థం బాధ్యత మాత్రమే. అది అధికారం కాదు. బాధ్యత అంటే ఆ విధులన్నీ తన చేతిలోకి తీసుకోమని కాని, తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కొర్రీ పెట్టాలని కాదు. ఇదే సెక్షన్‌లోని 3వ నిబంధన కింద తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించాలన్న నిబంధన ఉంది.

అది చెబుతున్నదేమిటి? గవర్నర్ సూపర్‌పవర్ కాదనే. అన్నింటినీ తెలంగాణ మంత్రి మండలితో సంప్రదించి తీరాలనే. అదే సమయంలో ఏపీ మంత్రిమండలిని సంప్రదించాలన్న నిబంధనలేక పోవడం ఎవరి స్థాయి ఏమిటో స్పష్టంగానే వివరించింది. సహజంగానే ఇరు రాష్ర్టాల ప్రజలు నివసిస్తారు కాబట్టి వారి రక్షణ విషయంలో అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో అవసరమైన పక్షంలో వినియోగించే నిమిత్తం వీటిని పొందు పరిచారే తప్ప ఈ సెక్షన్ స్ఫూర్థి గవర్నర్ పాలన సాగించాలని కాదు. అదే ఉద్దేశమై ఉంటే బిల్లులో పదేళ్లపాటు గవర్నర్ పాలన ఉంటుందని నేరుగానే పేర్కొనేవారు. రేపు ఏదైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లిన పక్షంలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ చేర్చారు.

ఉమ్మడి పోలీస్ బోర్డు ఎక్కడినుంచి వచ్చింది?…
వాస్తవం ఇదికాగా చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు కేంద్ర హోంశాఖ కూడా వంత పాడుతోంది. అసలు బిల్లులోని సెక్షన్-8లో కనిపించని ఉమ్మడి పోలీస్ బోర్డు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. విభజన బిల్లులో ఈ పోలీస్ బోర్డుకు సంబంధించిన అంశమే లేదు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిని ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం, రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉపయోగించుకునేలా ఏర్పాటుచేశారు.