అన్నిమతాలవారు కలిసుండాలి

రాష్ట్రంలోని అన్నిమతాలవారు శరీరంలోని భాగాలుగా కలిసికట్టుగా ఉండాలని, శాంతిసౌభాగ్యాలతో సుఖంగా జీవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జీసస్ దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం అబిడ్స్‌లోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన వేడుకలకు సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే చర్చిలో పదేండ్లుగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న. ఈ ఏడాది నాకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు వచ్చినపుడు 2014లో తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ జరుపుకొంటామని చెప్పాను. జీసస్ దయతో స్వరాష్ట్ర కల సాకారమయింది. స్వరాష్ట్రంలో అంతా ఆనందంగా ఉండేలా పాలన కొనసాగిద్దాం. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం అని సీఎం అన్నారు.

KCR-Participated-in-Chrismas-Celebrations

-ప్రజలంతా ఆనందంగా ఉండేలా పరిపాలన
-దేశానికే ఆదర్శంగా నిలుద్దాం
-క్రైస్తవుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
-క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-అబిడ్స్‌లోని మెథడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
సుదీర్ఘ చరిత్ర గల హైదరాబాద్‌లో పెద్దఎత్తున నివసిస్తున్న క్రైస్తవులకు కమ్యూనిటీహాల్ లేకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. క్రైస్తవులకు భవనం కోసం వెంటనే నిర్ణయం తీసుకున్నా. దేశంలోనే గొప్పగా ఉండేలా రూ.10 కోట్లతో భవనం నిర్మించాలని నిధులు విడుదల చేసిన. క్రిస్మస్‌లోపు అనుమతులు అన్నీ పూర్తికావాలని భావించాను. అయితే అంతకు ఒక్కరోజు ముందే.. జీసస్ దయతో శంకుస్థాపన కూడా పూర్తయింది. నేను చెప్పిన మాటలో నిజాయితీ ఉంది కాబట్టే భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు అని పేర్కొన్నారు. క్రైస్తవుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణలోని ప్రతి క్రైస్తవుడూ సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. క్రైస్తవ మతగురువులు సీఎం కేసీఆర్‌కు యేసుప్రభు కృప కలుగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెథడిస్ట్ చర్చి బాధ్యులు మాట్లాడుతూ క్రైస్తవులకు సొంత భవనం నిర్మించి ఇస్తామని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లతోపాటు.. క్రిస్మస్ మరుసటి రోజు, జనవరి 1న సెలవు దినాలుగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. ప్రార్థన గీతాల ఆలాపనలో ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం గాయకులతో గొంతు కలిపి ఆహూతులను అలరించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు కే కవిత, కే కేశవరావు, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, టీ పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, టీఆర్‌ఎస్ నేతలు ఆర్వీ మహేందర్‌కుమార్, టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్ ధూత్, పార్టీ నాయకులు శ్యాంసుందర్‌రావు, సాయికిరణ్, రవీంద్రచారి, సంజయ్‌సింగ్, మల్లేశ్‌ముదిరాజ్, గ్రేటర్ జేఏసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ భద్రుద్దీన్ పాల్గొన్నారు.