అన్నదాత కష్టాలు తీరుస్తాం

-చెరువులతోనే గ్రామాల అభివృద్ధి
-కృష్ణా, గోదావరి ఎత్తిపోతల పథకాలతో చెరువులు నింపుతాం
-ఏటా రెండు పంటలు పండేలా కృషి చేస్తాం
-మిషన్ కాకతీయలో ప్రజాప్రతినిధులు

Mission Kakatiya

దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అన్నంపెట్టే అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని పలువురు నేతలు పేర్కొన్నారు. గురువారం పలు జిల్లాల్లో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు చెరువులతోనే గ్రామాల ఆర్థికాభివృద్ధి సాధ్యమని, కృష్ణా, గోదావరి నదుల ఎత్తిపోతల పథకాలతో చెరువులు, కుంటలు నింపి ఏటా రెండు పంటలు పండేలా కృషి చేస్తామన్నారు. ఆకుపచ్చ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నందిగామ, దీక్షకుంట, గొల్లబుద్దారం, చికినేపల్లిల్లో మిషన్ కాకతీయ పనులను అటవీశాఖ మంత్రి జోగు రామన్న, శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. నల్లబెల్లి మండలం రంగాపురం మంగళి చెరువు పనులను టీఆర్‌ఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం కుక్కలగూడూర్ బండలవాగు చెరువులో ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కొడిమ్యాల మండలం పూడూరులో రావికుంట చెరువులో ఎమ్మెల్యే బొడిగె శోభ పనులను ప్రారంభించారు.

నల్లగొండ జిల్లా గుండాల మండలం అనంతారం ఊర చెరువు, షాపురం ఊర చెరువు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, చింతపల్లి చెరువు, గౌరారం చెరువు పనులను జెడ్పీచైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం వనపట్ల, అవురాసిపల్లిల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆత్మకూర్ మండలం నందిమల్ల పెద్ద చెరువులో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, కేశంపేట మండలం భైర్‌ఖాన్‌పల్లి చెన్నంచెరువు పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, చిన్నచింతకుంట మండలం తిర్మలాపూర్ యాపల చెరువు, బండర్‌పల్లి పెద్దచెరువు పనులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఎమ్మెల్యే మధన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, కొండాపూర్ మండలం గారకుర్తి, తొగర్‌పల్లి, అలియాబాద్, కొండాపూర్, తేర్పోల్, గుంతపల్లి, మల్లెపల్లిల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ ఊరచెరువు పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కమ్మర్‌పల్లి మండలం మానాలలోని కోమటి చెరువు, నర్సాపూర్ చెరువు, బషీరాబాద్‌లోని కాడి చెరువు పనులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బోధన్ మండలం ఎరాజ్‌పల్లి, అమ్దాపూర్ ఊర చెరువుల్లో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పనులను ప్రారంభించారు.