అందరికీ కృతజ్ఞతలు

– ప్రతి ఒక్కరి స్పందనతోనే టీఆర్‌ఎస్ సభ భారీ సక్సెస్
– మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటం
– విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish-Reddy-press-meet

టీఆర్‌ఎస్ 14వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరఫున కృతజ్ఞతలు చెప్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వేముల వీరేశం తదితరులతో కలిసి ఆయన మంగళవారం తెలంబగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పిలుపును అందుకొని లక్షలాదిగా తరలివచ్చిన జనం కనీవినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేశారని జగదీశ్‌రెడ్డి అన్నారు.

ఇందుకు సహకరించిన పార్టీ గ్రామ, మండల, రాష్ట్రస్థాయి నాయకులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభకు రావాలనే ఉత్సాహం లక్షలాది మందిలో ఉన్నప్పటికీ.. కొంతమందికి వచ్చే వసతి లేకపోవడంతో వారికి ఆ మేరకు ఆర్టీసీ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రైవేటు వాహనాలు చాలా సహకారం అందించాయని అన్నారు. ఈ పదిహేను రోజులపాటు శ్రమించిన ఇన్‌చార్జీలు, వలంటీర్లు, సభా వేదిక, ప్రాంగణం, నగర అలంకరణ, పార్కింగ్.. ఇలా అన్ని కమిటీలవారికి అధినేత తరపున కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. సభ సందర్భంగా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు చనిపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. ఆ ఇద్దరు పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా కల్పించిన ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తున్నారని, వారిద్దరికీ రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా వస్తుందన్నారు. అయినప్పటికీ వారి కుటుంబాలను పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

ఇంకా మరికొన్ని ప్రమాదాల్లో గాయపడిన కార్యకర్తలకు కూడా కచ్చితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండురోజులపాటు నాగార్జునసాగర్‌లో పార్టీపరంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నూతనంగా ఎన్నికైనవారు చాలామంది ఉన్నందున ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వారికి మరింత సేవ చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ ఉంటుందన్నారు. దీంతోపాటు శాసనసభ, పార్లమెంటులో ఎలా వ్యవహరించాలి, మంచి పార్లమెంటేరియన్‌గా ఎలా గుర్తింపు పొందాలనే అంశాలపై వివిధ రంగాల నిపుణులు శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు.

సవాలు చేసేముందు ఆత్మపరిశీలన చేసుకో..: టీఆర్‌ఎస్‌ను సవాలు చేసేముందు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు గురువిందగింజలా మాట్లాడుతున్నారని, అందరికీ ఒకేన్యాయం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. పది నెలల్లో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, మొదటి మంత్రివర్గ సమావేశంలోనే మ్యానిఫెస్టోలోని 43 అంశాలకు ఆమోదం తెలిపిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేవలం తెలంగాణ అభివృద్ధి, సీఎం కేసీఆర్ పనితీరు చూసి మాత్రమే ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని చెప్పారు.

తమ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటుందని, కానీ చంద్రబాబుకు ఏనాడూ ఇచ్చిన హామీపై నిలబడే అలవాటులేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్న ఇతర పార్టీలవారితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళితే.. ఇక్కడ కూడా అలాంటి విధానం చూద్దామన్నారు.