అందరి భాగస్వామ్యంతోనే కొత్త విధానం

-తెలంగాణ ప్రభుత్వ వినూత్న ఆలోచన
-ఫలించిన పరిశ్రమల శాఖ కృషి
-సీఎం సునిశిత దృష్టిపై ప్రశంసల జల్లు
-ఆలోచనల కలబోతకు వేదికైన పారిశ్రామికవేత్తల భేటీ

KCR-0008

విధివిధానాల రూపకల్పన, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం అందరి ప్రశంసలు పొందుతున్నది. ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర అంచనాలతో అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సునిశిత దృష్టిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో సీఎం కేసీఆర్ ఆలోచనలు, ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు,కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఫ్యాప్సీ, అసోచాం, ఫిక్కీ, డిక్కీ ప్రతినిధులను మంత్రముగ్ధులను చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల భేటీలో ప్రపంచ దేశాల్లో అమలవుతున్న పారిశ్రామికవిధానాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అన్ని రంగాలు, అన్ని కోణాలతోపాటు సామాజిక, ఆర్థిక అసమానతల రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమవేశంలో చర్చించారు. సీఎం ప్రసంగించిన తర్వాత మేమేం మాట్లాడాలో.. ప్రభుత్వాన్ని ఏం కోరాలో తెలియక తికమకపడ్డామని సీఐఐ ప్రతినిధి సురేష్ అన్నారు.

సరిగ్గా తామేం కోరాలనుకున్నామో వాటినే అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని కితాబిచ్చారు. సీఎం విధానాన్ని ఫిక్కీ ప్రతినిధి సంగీతారెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే విషయంపై వారం రోజులు అధ్యయనం చేసొచ్చా. కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాత అడగడానికి ఇంకేం మిగల్లేదు అని డిక్కీ ప్రతినిధి రవికుమార్ అన్నారు. ప్రభుత్వానికి సానియామీర్జా బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు.. కానీ మాకు మాత్రం కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అని నాస్కా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి చెప్పారు. విధివిధానాలపై పూర్తిస్థాయిలో ఎంతో అధ్యయనం చేస్తే తప్ప సీఎం కేసీఆర్ మాదిరిగా సమగ్రంగా ప్రసంగించలేరని ఎఫ్‌ఎస్‌ఎంఈ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకా పలు సంస్థలు సీఎం సునిశిత దృష్టిని ప్రశంసించాయి.

ఆలోచనల కలబోత
ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేసేందుకు పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన ఈ సమావేశం అంచనాకు మించి విజయవంతమైందని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర తెలిపారు. భేటీకి అన్నిరంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. అగ్రి, బయో, ఫార్మా, ఐటీ, ఐటీ ఆధారిత, పత్తి పరిశ్రమల వంటి భారీ పరిశ్రమల యజమానులతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. గత పాలకుల విధి విధానాల్లోని లోపాలను ఎత్తి చూపారు. అలాగే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల తాము పడుతున్న కష్టనష్టాలను వివరించారు.

ప్రధానంగా ప్రోత్సాహకాలు, విద్యుత్ రాయితీలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఒక్కొక్క సంఘం నుంచి ఒక ప్రతినిధికి ఐదు నిమిషాల పాటు సమయమిచ్చారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి అందరి ప్రసంగాలను విని నోట్ చేసుకున్నారు. సందేహాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అధికారులను పిలిచి వివరణ అడిగారు. దాంతో పారిశ్రామిక విధానంపై అటు పారిశ్రామిక వర్గాల్లో, ఇటు అధికారుల్లో స్పష్టత లభించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.