అండగా ఉంటాం..

కష్టాలు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. కష్టాలకు భయపడి తనువు చాలిస్తే భార్యాపిల్లలు, కుటుంబం పరిస్థితి ఏమిటి? వాళ్లు రోడ్డున పడరా? అన్ని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు, కావొద్దు. సమైక్యపాలకులు, ప్రభుత్వాలు పోయాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. ఇప్పుడున్న రైతుల కష్టాలు రేపు ఉండవు. ధైర్యంగా ఉండండి. మీకు సర్కారు అండగా ఉన్నది. మీ కష్టాలను పంచుకుంటాం. కన్నీళ్లను తుడుస్తాం. ఇక మీదట ఏ ఒక్కరైతు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నా అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు.

Harish Rao handedover the cheqes to suicide farmers families

-అధైర్యం వద్దు.. మీ కష్టాలను పంచుకుంటాం
-ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా
-గజ్వేల్‌లో 12 కుటుంబాలతో ముఖాముఖి.. సహపంక్తి భోజనం
-రూ.1.5 లక్షల పరిహారం అందజేత.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం
-గోదావరి జలాలతో సాగుకు నీరందిస్తామని హామీ
అప్పులబాధలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులతో బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లోని టీవైఆర్ గార్డెన్స్‌లో ఆయన సమావేశమయ్యారు. జిల్లా అధికారులందరిని అక్కడికే రప్పించి వారి సమక్షంలో రైతు కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని నేరుగా సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. బాధిత కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.లక్ష చెక్కులను 12 మందికి అందించారు. మరో రూ.50 వేలను ఆప్పుల కింద జమచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వచ్చిన రైతు కుటుంబ సభ్యులు, పిల్లలను సమస్యలు అడిగితెలుసుకున్నారు.

Harish Rao handedover the cheqes to suicide farmers families

రూ.వెయ్యి వితంతు పింఛన్ వస్తున్నదా అని ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్లంతా పింఛన్ వస్తున్నదని చెప్తూనే ఇతర సమస్యలను ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి కుటుంబానికి 35 కిలోల రేషన్ బియ్యం, ఇల్లు లేని వారికి ఐఏవై పథకం కింద ఇల్లు, స్త్రీనిధి కింద రెండు బర్రెలు, వ్యవసాయం చేస్తున్న వారికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు మంజూరు చేశారు. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో చదువుకుంటున్న వారి పిల్లల ఫీజులను ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడి మాఫీ చేయిస్తామని హామీఇచ్చారు. తక్షణమే యాజమాన్యాలతో మాట్లాడాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జాను ఆదేశించారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పిస్తామని, బోరుబావులున్న వారికి స్ప్రింక్లర్లు అందిస్తామన్నారు. ఇంటర్ పూర్తిచేసిన ఇద్దరు యువకులకు కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీఇచ్చారు. అప్పులబాధతో తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డున పడ్డామని జగదేవ్‌పూర్ మండలం చేబర్తికి చెందిన భాస్కర్, భానుచందర్, విజయలక్ష్మి మంత్రి ఎదుట కన్నీళ్లు పెట్టుకోవడంతో రూ.10 వేలు వ్యక్తిగతంగా అందించారు. గజ్వేల్‌లో ఇల్లు నిర్మించి ఇస్తామని, భాస్కర్‌కు ఉద్యోగం ఇప్పించి, విజయలక్ష్మి, భానుచందర్‌ను చదివిస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ చదువుకుంటున్న తనకు ఫీజులు చెల్లించడమే ఇబ్బందిగా ఉందని, అమ్మ కష్టం చూస్తుంటే బాధగా ఉందని మరో యువతి కన్నీళ్లు పెట్టుకోవడంతో రూ.5 వేలు వ్యక్తిగతంగా అందించారు.

అండగా ఉంటామని భరోసాఇచ్చారు. అన్ని ప్రభుత్వ పథకాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తెస్తున్నారని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.50 అందిస్తుందని, అధికారులే దగ్గరుండి చెల్లిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇబ్బందులుంటే తనను కూడా సంప్రదించవచ్చని సూచించారు. కష్టసుఖాలను తెలుసుకుని బాధలు పంచుకున్న మంత్రికి బాధిత కుటుంబాలు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాయి.

మెదక్ జిల్లాలో రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులు: మెదక్ జిల్లాలో రెండు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, వాటి ద్వారా 6లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా గోదావరి జలాలు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేని ఏకైక జిల్లా మెదక్ అని, సమైక్యపాలనలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నా రు. అన్నదాతల ఆత్మహత్యలు ఉండని తెలంగాణను ఆవిష్కరించడానికే సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఆ లోటును పూడ్చడానికి జిల్లాలో భారీ ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మతులు చేపట్టి వ్యవసాయ అభివృద్ధిలో జిల్లాకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక, ములుగు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డులో సద్దిమూట కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమా ల్లో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి హనుమంతరావు, ఆర్డీవో ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.