అంచనాలకు మించి సభ్యత్వ నమోదు

-టీఆర్‌ఎస్‌కు విశేష జనాదరణ
-స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలు
-ఇప్పటివరకు తొమ్మిది జిల్లాల్లో 23,65,455 మందికి సభ్యత్వం
-43,54,750 సభ్యత్వాలకు పుస్తకాల జారీ

Kalvakuntla Kavitha giving membership card to mallaiah in asifabad

గులాబీ దళంలో చేరేందుకు జనం దండు కదులుతున్నది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. ఇదే జోరు కొనసాగితే అంచనాకు మించి రెట్టింపు సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనం నుంచి వస్తున్న ఆదరణతో టీఆర్‌ఎస్ నేతలు, నాయకులు, శ్రేణులు మరింత ఉత్సాహంగా, హుషారుగా ముందుకు సాగుతున్నారు. అరకోటికిపైగా సాధారణ, పది లక్షల వరకు క్రియాశీల సభ్యత్వం నమోదు అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

గత వారం చేపట్టిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు తొలుత 30లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 6లక్షల మంది క్రియాశీల సభ్యులు, 24లక్షల మంది సాధారణ సభ్యులు చేరుతారని అంచనా వేశారు. కానీ.. ఈ అంచనాలన్నీ పటాపంచలవుతున్నాయి. ఇప్పటికే వరకు 43,54,750 సభ్యత్వాల నమోదుకు వీలుగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో 9,56,225 క్రియాశీల సభ్యత్వాలు, 33,98,525 సాధారణ సభ్యత్వాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ కాకుండా మిగతా తొమ్మిది జిల్లాల్లో 23,65,455 సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇందులో 5,28,383 క్రియాశీల సభ్యత్వాలు, 18,37,072 సాధారణ సభ్యత్వాలు ఉండటం గమనార్హం.

Membership drive

గ్రేటర్ హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదుకు సంబంధించి లెక్కలు అందాల్సి ఉంది. ఇక్కడ ఐదు లక్షల వరకు సభ్యత్వాలు నమోదు చేయించాలని భావించగా.. ఇప్పటికే సభ్యత్వ నమోదు వేగంగా సాగుతూ లక్ష్యానికి చేరువైంది. ఇప్పటికే 5.11లక్షల సభ్యత్వాలకు పుస్తకాలు తీసుకెళ్లారు. ఇక్కడకూడా రెట్టింపు సభ్యత్వాలు నమోదవుతాయని భావిస్తున్నారు. మరోవైపు గురువారం ఒక్క రోజే 2,32,250 సభ్యత్వాలకు సంబంధించిన అదనపు పుస్తకాలు వివిధ జిల్లాల నాయకులు తీసుకెళ్లారు. ఇందులో 85,500 క్రియాశీల సభ్యత్వ పుస్తకాలు, 1,46,750 సాధారణ సభ్యత్వ పుస్తకాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తున్నదని, అంచనాకు మించి రెట్టింపు సభ్యత్వం అయ్యేలా ఉందని సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు.