అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్

రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు రెండు వారాల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సంస్థలను రాష్ర్టానికి ఆహ్వానించనున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలపై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరే ముందు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఐటీ దిగ్గజాలకు, ఐటీ కంపెనీల్లో భారతదేశం, ముఖ్యంగా హైదరాబాద్ పట్ల మంచి పేరున్నదని తెలిపారు.

KTR visit to America

-పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన
-రెండువారాలపాటు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు
-రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై విస్తృత ప్రచారం
అమెరికాలోని ప్రవాస భారతీయ పెట్టుబడిదారులు, ముఖ్యంగా తెలంగాణ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తామని చెప్పారు. అందుకోసమే ఐటీశాఖ అధికారులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రెండువారాలపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో తెలంగాణ యువతీ, యువకులను కలిసి రాష్ట్రంలో అమలుచేస్తున్న వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, ఇతర సంక్షేమ పథకాల గురించి వివరించి, వారిని భాగస్వాములను చేసేలా ప్రయత్నిస్తామన్నారు. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చెప్పారు.

దీంతోపాటు నాస్కాం, సైంట్ సదస్సులో పాల్గొనన్నుట్లు చెప్పారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో రాష్ర్టానికి ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ యుతకు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. అందుకే కొత్త పారిశ్రామిక, ఐటీ పాలసీలను రూపొందించామని, వీటిపై అమెరికాలో విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. కాగా, డల్లాస్ నగరంలో కేటీఆర్ పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి తెలంగాణ సంఘాల నేతలు తెలిపారు. వైబ్రంట్ హైదరాబాద్, బిజినెస్ బియాండ్ బౌన్డరీస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అమెరికాలో కేటీఆర్ షెడ్యూల్ ఇదీ..
మే 6: వాషింగ్టన్‌లో భారత రాయబారితో లంచ్ మీటింగ్. అదేరోజు సాయంత్రం న్యూయార్క్‌కు ప్రయాణం.
మే 7: న్యూయార్క్‌లో డీయిషా, ఇతర వ్యాపారవేత్తలతో సమావేశం. సాయంత్రం న్యూజెర్సీలో ఎన్‌ఆర్‌ఐల కార్యక్రమానికి హాజరు.
మే 8: న్యూజెర్సీ నుంచి పిట్స్‌బర్గ్‌కు ప్రయాణం. మెలాన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, సీఈవోతో భేటీ.
మే 9: పిట్స్‌బర్గ్ నుంచి డల్లాస్‌కు ప్రయాణం. పలువురు వ్యాపారవేత్తలతో బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌సమావేశాలు. సాయంత్రం డల్లాస్‌లోని ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం.
మే 10: డల్లాస్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణం.
మే 11: పాలో ఆల్టోలో జరిగే మేక్ ఇన్ ఇండియా ఈవెంట్‌కు హాజరు. అనంతరం గూగుల్ ప్రతినిధులతో భేటీ.
మే 12: సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలతో భేటీ.
మే 13: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సందర్శన.
మే 14: ఫిక్కీ ఇంటరాక్షన్ సెషన్‌కు హాజరు.
మే 15: ట్రైకాన్ కాన్ఫరెన్స్‌కు హాజరు. సిస్కో కార్పొరేషన్ సీఈవో జాన్ చాంబర్స్‌తో భేటీ.
మే 16: టెలికాం నెట్‌వర్క్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం.
సాయంత్రం ఎన్‌ఆర్‌ఐలతో భేటీ.
మే 18: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం.