అమరుల త్యాగం వెలకట్టలేం

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి జగదీశ్‌రెడ్డి..
-నల్లగొండలో 47 కుటుంబాలకు చెక్కులు పంపిణీ

Cheques-to-Telangana-Martyrs-Families--01

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 47 మంది అమరవీరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక రక్తపు చుక్క కూడా నేల రాలకుండా తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2011లో ఉద్యమం మొదలుపెట్టారని చెప్పారు. ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆంధ్రా పాలకుల కుట్రలు, మీడియా లో ఒక వర్గం చేసిన దుష్ప్రచారంతో తెలంగాణ రాదేమోనని ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమంపై, ఉద్యమకారులపై అప్పటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. శ్రీకాంతాచారితో పాటు అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారులు బలిదానాలకు పాల్పడ్డారని వాపోయారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలతో పాటు కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం, ఇంటిస్థలం, ఇల్లు మంజూరు చేస్తుందన్నారు.

కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తొలివిడతలో 53 మంది అమరుల కుటుంబాలను ఎంపిక చేసి రూ.10 లక్షల చొప్పున రూ.5.3 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమానికి ఆరు కుటుంబాలు రాలేదని, వారికి తర్వాత చెక్కులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్‌కుమార్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, డీఆర్వో రవినాయక్ పాల్గొన్నారు.

Cheques-to-Telangana-Martyrs-Families Cheques-to-Telangana-Martyrs-Families01