అల్లాదయతో బంగారు తెలంగాణ

-ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం
-వీసీ, టీపీఎస్సీ, మార్కెట్ కమిటీ పదవుల్లో అవకాశం
-ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

KCR-007

అల్లా దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ అల్లా దయతోనే బంగారు తెలంగాణను సాధించుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రతిఒక్కరి ముఖంపై చిరునవ్వులు చిందినప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లని అన్నారు. మంగళవారం హైటెక్స్‌లో ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విందుకు ఆరువేలమందికి పైగా ముస్లింలు హాజరయ్యారు. ప్రార్థన కార్యక్రమం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సలీం, మెహబూబ్ విద్యాసంస్థల అధినేత మెహబూబ్ ఆలంఖాన్ ఖర్జూరా తినిపించారు. కేసీఆర్ కూడా ముస్లిం పెద్దలకు ఖర్జూరా తినిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే ఒక అధ్యయన కమిటీ వేస్తుందని, ఈ కమిటీ మూడు నెలల్లోనే రిపోర్టు ఇచ్చేలా చూస్తామని తెలిపారు.

తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న సీఎం.. అక్కడ కూడా కమిటీ పర్యటించి వస్తుందని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు అమలుచేసే విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని నొక్కిచెప్పారు. ముస్లింల కోసం వెయ్యికోట్లు కేటాయింపులు చేశామని గుర్తు చేశారు. వైస్‌చాన్స్‌లర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, నాయకుడు, సినీ నిర్మాత శివకుమార్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఉర్దూలో మాట్లాడటంతో అక్కడికొచ్చినవారంతా ఆనందించారు.