ఐదు రోజుల్లో టెండర్లపై ఒప్పందం

– జాప్యం జరిగితే కాంట్రాక్టర్లపై చర్యలు
– పరిపాలనా అనుమతులతో టెండర్లు పిలవండి
– పనుల పురోగతిలో జాప్యం వద్దు
– ఇతర శాఖలతో సమన్వయానికి ప్రాధాన్యం
– వెబ్‌సైట్‌లో టెండర్ల ఖరారు వివరాలు పెట్టాలి
– మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు ఆదేశం

MInister-Harish-Rao-video-conference-on-mission-kakatiya

చెరువుల మరమ్మతు పనులకు ఖరారైన టెండర్లపై ఐదు రోజుల్లో సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశించారు. గడువులోగా టెండర్లపై ఒప్పందాలు ఖరారుకాకపోతే రెండో బిడ్ దాఖలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు అమలులో వివిధ జిల్లాల్లో పనుల పురోగతిని మంత్రి హరీశ్‌రావు శనివారం నీటిపారుదలశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ నెలాఖరు నాటికి జిల్లాల్లోని 20 శాతం చెరువుల మరమ్మతు పనులపై అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. ఆయా పనులపై వివిధ రకాల రిమార్కుల నమోదుతోపాటు సూపరింటెండెంట్ ఇంజినీర్లు (ఎస్‌ఈ), చీఫ్ ఇంజినీర్ల (సీఈ) వద్ద పెండింగ్‌లో ఉన్న చెరువుల మరమ్మతు అంచనాల సమస్యలను పరిష్కరించి నివేదిక పంపాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాతో మొదలు పెట్టి మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలో పనులపై మూడున్నర గంటల పాటు సమీక్షించారు. పనుల పురోగతిపై జిల్లాల ఎస్‌ఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ను అడిగి తెలుసుకున్నారు. పనుల అమలుకు వచ్చేవారంనాటికి లక్ష్యాలను నూటికి నూరుశాతం పూర్తిచేయాలన్నారు.

టెండర్లలో జాప్యానికి కారణాలేమిటి?
గుర్తించిన చెరువుల మరమ్మతు పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినా పలు జిల్లాల్లో టెండర్లను పిలవడంలో జాప్యానికి కారణాలేమిటని మంత్రి అధికారులను ప్రశ్నించారు. జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు ప్రభుత్వ అనుమతులు పొందిన చెరువుల మరమ్మతు పనులకు వెంటనే టెండర్లను పిలవాలని ఆదేశించారు. టెండర్లు పిలవడంలో అన్ని జిల్లాల కంటే ముందున్న వరంగల్ జిల్లా ఎస్‌ఈ పద్మారావును మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇప్పటివరకు అనుమతులు మంజూరుచేసిన చెరువుల మరమ్మతు పనులకు వచ్చే వారం నాటికి టెండర్లను ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వానికి చేరిన అంచనా నివేదికలకు ఎప్పటికప్పుడు పరిపాలనా అనుమతుల జారీకి చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ సాంకేతిక విభాగం డిప్యూటీ కార్యదర్శిని ఆదేశించారు. క్లాస్-5 కాంట్రాక్టర్లకు అయిదు పనులు, రూ.5 కోట్లకు మించి కేటాయించకుండా నిబంధనలు రూపొందించాలని పలువురు ఎస్‌ఈలు కోరగా, పరిశీలించి తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ను ఆదేశించారు.

ఇతర శాఖలతో సమన్వయంతో ముందుకెళ్లండి
ఒకవైపు టెండర్ల పనులు నిర్వహిస్తూనే మరోవైపు రెవెన్యూ, అటవీ, వ్యవసాయశాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ నెల 15 నుంచి వ్యవసాయశాఖ అధికారులు రుణమాఫీ పత్రాల పంపిణీలో పాల్గొంటున్నందున మండల ఇంజినీర్లు ఆ బాధ్యతల్లో భాగస్వాములు కావాలన్నారు. ప్రజలకు మిషన్ కాకతీయ లక్ష్యాలు వివరించి.. పూడిక మట్టిని పొలాల్లో చల్లుకోవడంతో ఒనగూడే ప్రయోజనాలను వివరించాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సకాలంలో భూసార పరీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయంచేసుకోవాలన్నారు. అటవీశాఖ అధికారుల పరిధిలోని నర్సరీలను సందర్శించి తమకు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలన్నారు.

అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో ఉండాలి
టెండర్లు పిలిచిన చెరువుల వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆ సమాచారం పొందుపర్చడంలో కొందరు ఈఈలు వెనకబడడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పారదర్శకంగా మిషన్ కాకతీయ పథకం నిర్వహణకు వెబ్‌సైట్ నిర్వహిస్తున్న సంగతి ఆయన గుర్తుచేశారు. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పనుల పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్ ఉండాలని ఈఎన్‌సీని ఆదేశించారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, జేసీబీల లభ్యతపై అవగాహన రావాలన్నారు. సరిపడా లభ్యత లేనిపక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇంజినీర్లకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ పథకం అమలుకు కేంద్ర సాయం కోసం పంపాల్సిన డీపీఆర్‌లను ఈ నెలాఖరుకల్లా కేంద్రానికి పంపాలని సూచించారు. తొలిదశలో ఇప్పటివరకు తయారైన 128 డీపీఆర్‌లను వెంటనే కేంద్రానికి పంపాలని సంబంధిత అధికారి మల్సూర్‌ను ఆదేశించారు.

దాతలకు ప్రత్యేక అభినందనలు..
చెరువుల దత్తతకు, వాటి పునరుద్ధరణకు విరాళాలు ప్రకటించడానికి ముందుకొచ్చిన వారికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అటువంటి వారితో వ్యక్తిగతంగా గానీ, ఈ – మెయిల్స్ ద్వారా గానీ సంప్రదించి మిషన్ కాకతీయ సమాచారం అందుబాటులో ఉంచాలని ఆయన ఇంజినీర్లకు సూచించారు. ఇప్పటి వరకు విరాళాలిచ్చేందుకు, చెరువుల దత్తత తీసుకున్న వారిలో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలు, స్థానిక పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, మాజీ సైనికులు, ఉద్యోగులు ఉన్నారని మంత్రి వివరించారు. టీఎన్జీవోలు ఒకరోజు శ్రమదానం చేయడానికి ముందుకొచ్చిన విషయం గుర్తుచేశారు. తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగుల సంఘం, సాగునీటి శాఖ టీఎన్జీవోశాఖ, గనులు – భూగర్భ శాఖ ఉద్యోగులు మిషన్ కాకతీయ పథకానికి ఒకరోజు వేతనం విరాళంగా ప్రకటించారని చెప్పారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగుల డిమాండ్లన్ని నెరవేరుస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 43శాతం ఫిట్‌మెంట్‌తో పదో పీఆర్సీ ప్రకటించిన సంగతి గుర్తుచేశారు. ఉద్యోగులు కూడా అదేవిధంగా ప్రతిస్పందించాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పనుల్లో పురోగతి కనపరిచిన ఎస్‌ఈ, ఈఈలను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, విజయ ప్రకాశ్, నారాయణరెడ్డి, సీఈలు రామకృష్ణారావు, రమేశ్, ఎస్‌పీడీ మల్సూర్ పాల్గొన్నారు.