ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం

– ఉద్యమ చైతన్యంతో ప్రశాంతంగా ప్రక్రియ
– నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు

TRS district presidents

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత నిర్మాణంలో భాగంగా రెండ్రోజులపాటు జరుగనున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో తొలి రోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఐదు జిల్లాలకు ఆరు కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా నిరసనలుగానీ, అలకలుగానీ కనిపించలేదు. ఈ ఎన్నికల్లో పార్టీలో చెక్కు చెదరని ఐక్యత ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి.

పాతవారికే పట్టం..: ఖమ్మం మినహా మిగిలిన అన్నిచోట్లా పాత వారినే తిరిగి ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లాకు నిన్నటివరకు అధ్యక్షుడిగా కొనసాగిన బండా నరేందర్‌రెడ్డి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. కరీంనగర్‌లోనూ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డికే బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంత అధ్యక్షుడిగా ఉన్న లోక భూమారెడ్డి మరోసారి జిల్లా సారధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ తూర్పు ప్రాంతానికి గతంలో అధ్యక్షుడిగా ఉన్న పురాణం సతీశ్ కూడా మళ్లీ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఖమ్మంలో మాత్రం కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించింది. ఇప్పటిదాకా రాజేందర్ జిల్లా అధ్యక్షుడిగా ఉండగా.. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా బుడాన్ షేక్ బేగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న నాగేందర్‌గౌడ్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సడలని చైతన్యం: సాధారణంగా రాజకీయ పార్టీల సంస్థాగత ఎన్నికలంటే వారం, పదిరోజుల పాటు శిబిరాలు.. జిల్లాలోని ప్రధాన నేతల మధ్య పోటీ సమావేశాలు.. ఎన్నిక సమావేశంలో రసాభాస.. గాలిలో ఎగురుతూ కనిపించే కుర్చీలు.. ముష్టియుద్దాలు.. పోలీసుల రంగ ప్రవేశం.. వంటివి ఏమీ లేకుండా.. బాధ్యతాయుతంగా.. ఒక్కమాటపై జిల్లా సారథ్య బాధ్యులను నాయకులు, కార్యకర్తలు ఎన్నుకోవడం విశేషం. రాష్ట్ర సాధన పోరాటం నాటి ఉద్యమ చైతన్యం టీఆర్‌ఎస్‌లో ఏ మాత్రం సడలలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఆయా జిల్లాలకు పార్టీ ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన మంత్రుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ సాఫీగా ముగిసింది. నల్లగొండకు మంత్రి జూపల్లి కృష్ణారావు, కరీంనగర్‌కు టి.హరీష్‌రావు, ఖమ్మంకు జి.జగదీశ్‌రెడ్డి, ఆదిలాబాద్ తూర్పు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆదిలాబాద్ పశ్చిమం పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.

నేడు మిగిలిన జిల్లాల్లో..
మిగిలిన ఐదు జిల్లాలకు ఆరు కార్యవర్గాల ఎన్నికల ప్రక్రియ గురువారం పూర్తి కానుంది. మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌తోపాటు వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ జిల్లాలకు కార్యవర్గ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ జిల్లాలకు పార్టీ ఎన్నికల అధికారులుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి వ్యవహరించనున్నారు.