ఐదేండ్లు నష్టాన్ని భరిస్తాం

మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్‌ను వచ్చే బడ్జెట్‌లో చేర్చాలి
-మూడో వంతు ఖర్చు కూడా మాదే
-ప్రధానికి ఎంపీ వినోద్‌కుమార్ లేఖ

Vinod Kumar

మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్ నిర్మిస్తే ఐదేండ్లపాటు నష్టాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రం ఈ రైల్వేలైన్ నిర్మాణం కోసం ఈ నిబంధన విధించగా, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. ఈ రైల్వేలైనుపై ఉన్న శ్రద్ధతో, గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఈ లైనుకోసం చేసిన ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని నష్టం భరించేందుకు అంగీకరించారుఅని కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్యరైల్వే చీఫ్ ఇంజినీర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని చెప్పారు.

సోమవారం కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ డిసెంబర్‌లో సప్లిమెంటరీ బడ్జెట్ లేదా 2015-16 రైల్వే బడ్జెట్‌లో ఈ రైల్వేలైన్‌ను చేర్చి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖను కూడా జత చేశానని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో ఈ రైల్వేలైన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నాని వెల్లడించారు. ఇప్పటికే రైల్వేలైన్ నిర్మాణ వ్యయంలో రాష్ట్రవాటాగా 1/3 ఖర్చు భరించేందుకు, భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు అంగీకారం తెలిపిందని, కొత్తగా సూచించిన ఐదేండ్ల నష్టంనిబంధనను కూడా అంగీకరించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి నిబంధన లేదని, ఈ లైన్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వ అంగీకారాన్ని దృష్టిలో ఉం చుకొని ఈ లైన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొడిగ శోభ, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో రేపటి నుంచి అండర్-14 ఖోఖో పోటీలు
కొత్తపల్లి: కరీంనగర్ మండలం కొత్తపల్లి(హ) శివారులోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో బుధవారం నుంచి 12 వరకు నిర్వహించనున్న 60వ జాతీయస్థాయి అండర్-14 బాలబాలికల ఖోఖో పోటీలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సోమవారం పాఠశాలలో ఏర్పాట్లను ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయస్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కేవలం క్రీడలను ప్రారంభించేందుకే వస్తున్నారని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవన్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలుగకుండా వైద్య బృందాలను అందుబాటులో ఉంచామన్నారు.