ఐదేళ్లలో ఫ్లోరోసిస్‌ను పారదోలుతాం

– వంకర బుద్ధి పాలకులే నల్లగొండను వికలాంగ జిల్లాను చేశారు
– జిల్లాలో జాతీయ ఫ్లోరోసిస్ పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తాం
– ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
– వ్యతిరేకతను తప్పించుకునేందుకు తెలంగాణపై బాబు కుట్రలు: మంత్రి జగదీష్‌రెడ్డి

KTR
నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ మహమ్మారిని ఐదేళ్లలోపలే శాశ్వతంగా నిర్మూస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఇందుకు జిల్లాలో జాతీయ ఫ్లోరోసిస్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

వంకర బుద్ధి కలిగిన ఆంధ్రా పాలకులు నల్లగొండ జిల్లాను వికలాంగ జిల్లాగా మార్చారని ఆరోపించారు. మోత్కూరు మండలం కొండగడపలో గురువారం పలు అభివృద్ధి పనులను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. రూ.19వేల కోట్ల భారం పడుతున్నా రూ. లక్షలోపు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనుందన్నారు. దసరా, దీపావళి మధ్యలో రేషన్‌కార్డులు, నవంబర్ మొదటి మాసంనుంచి పింఛన్లు ఇస్తామని చెప్పారు. 1200 పైచిలుకు తండాలను పంచాయతీలుగా మారుస్తున్నామని, దళిత, గిరిజన కుటుంబాల ఆడబిడ్డలకోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల ద్వారా 500 గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణపై బాబు కుట్రలు : మంత్రి గుంటకండ్ల
తనపై వస్తున్న వ్యతిరేకతను మళ్లించేందుకు చంద్రబాబు తెలంగాణపై కుట్రలకు యత్నిస్తున్నాడని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కడైనా ఏ కుటుంబంలోని పిల్లల బాధ్యతను వారే చూసుకుంటారని.. చంద్రబాబు మాత్రం ఆ రాష్ట్ర పిల్లలకు తెలంగాణ నుంచి ఫీజులు కావాలంటున్నాడని అన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులతోపాటు కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి కూడా నోరు మెదపకపోవడం చంద్రబాబుకు వత్తాసు పలకడమేనన్నారు. తెలంగాణలో అన్ని వనరులూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడున్న విద్యుత్ లోటు ఆంధ్రా పాలకుల పాపం కాదా? అని ప్రశ్నించారు.