ఆ బస్సులను సీజ్ చేయండి

-నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై సీఎం ఆగ్రహం
-మాసాయిపేట ఘటనపై అధికారులతో సమీక్ష

KCR 01 (2)
రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులను సీజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. మాసాయిపేట బస్సు ఘటనపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జరుగుతున్న ఘటనలు కలిచివేస్తున్నాయని, రవాణాశాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రమాదాలు అరికట్టాలని సీఎం సూచించారు.

శిక్షణలేని డ్రైవర్ల లైసెన్సు రద్దు చేయాలని ఆదేశించారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదని గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న బస్సుల సంఖ్య, ఫిట్‌నెస్, పర్మిట్లు తదితర వివరాలు చర్చకు వచ్చాయి. మాసాయిపేట ఘటనకు ప్రధాన కారణాన్ని కమిషనర్ నుంచి అడిగి తెలుసుకున్న సీఎం.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. శిక్షణలేని డ్రైవర్లు నడిపితే బస్సును సీజ్ చేయడంతోపాటు సంబంధిత యజమానిపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బంది కొరతను తీర్చడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని, ఉద్యోగ ఖాళీల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పారదర్శకత, విధుల నిర్వహణలో చిత్తశుద్ధి అవసరమని సూచించారు. తనిఖీలను క్రమం తప్పకుండా చేపట్టాలని కోరారు. ఈ సమీక్షలో రవాణాశాఖ కమిషనర్ జగదీశ్వర్, జాయింట్ ట్రాన్సుఫోర్టు కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవర్లకు శిక్షణ
మాసాయిపేట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని పదిజిల్లాల్లో ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ నెల 27న డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రవాణాశాఖ కమిషనర్ జగదీశ్వర్ తెలిపారు. రైల్వే క్రాసింగ్‌లు, సిగ్నళ్ళ వద్ద ఎలా వ్యవహరించాలో చెప్పడంతోపాటు, మోటారు వాహన చట్టాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు.