పదేళ్ల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్

– చివరిసారి ఎమ్మెల్యే హోదా.. ఇప్పుడు సీఎం?
రాజకీయ చదరంగంలో పావులు కదపటంలోనూ, విజయబావుటా ఎగురవేయడంలోనూ తనకు తిరుగులేని లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట నుంచి వరుసగా డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి రికార్డు మెజార్టీతో ఘన విజయాలు సాధించారు. గజ్వేల్ నుంచి విజయం సాధించిన కేసీఆర్ పదేళ్ల తర్వాత మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.1983లో తొలిసారి సిద్దిపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఓటమి పునాదిపై విజయసౌధాన్ని నిర్మించుకుని సిద్దిపేటను కంచుకోటగా మార్చేశారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి టీ మహేందర్‌రెడ్డిపై 16,56 ఓట్ల మెజార్టీతో విజయాల ఖాతా తెరిచి నేటి వరకు అజేయంగా ముందుకు సాగుతున్నారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి మధన్‌మోహన్‌పై, 1994, 1999 ఎన్నికల్లోనూ గెలిచారు. గుళాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్ 2001 ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా టీడీపీ అభ్యర్థి ఎం శ్రీనివాస్‌రెడ్డిపై గెలిచారు. 2004లో సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. తర్వాత సిద్దిపేట అసెంబ్లీకి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. 2006లో రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలుపొందారు. 2009లో మహాబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గజ్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన కేసీఆర్ ఘన విజయం సాధించారు.