ఏరోస్పేస్,డిఫెన్స్ రంగాలకు ప్రోత్సాహం

-వ్యాపారవేత్తలకు అన్నివిధాల ప్రోత్సాహం: సీఎం కేసీఆర్
-డిఫెన్స్, ఏరోస్పేస్ సప్లయ్-2014 సదస్సు ప్రారంభం

KCR 02

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారించామని, అందులోభాగంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ రంగాలకు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందన్నారు. డీఆర్డీవో, డీఆర్డీఏ, డీఎంఆర్‌ఎల్, ఆర్సీఐ, అనురాగ్‌లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గరున్న నోవాటెల్ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఇజ్రాయెల్ కెనెస్ ఎగ్జిబిషన్ సంయుక్తంగా చేపట్టిన డిఫెన్స్, ఏరోస్పేస్ సప్లయ్-2014 మూడురోజుల ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్‌ను బుధవారం రాత్రి సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్షణ, విమానయాన రంగాల్లో కేంద్రం 49 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదించినందువల్ల విస్తారంగా పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ఆమోదించనున్నట్లు స్పష్టంచేశారు. అయితే కేంద్రం నుంచి ఐదేండ్ల పాటు ఆదాయపన్ను, పదేండ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్‌డ్యూటీ రాయితీలకు అనుమతి లభిస్తుందని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్తలకు విస్తృత రాయితీలు కల్పిస్తామని ఈ సందర్భంగా మరోసారి స్పష్టంచేశారు. టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్ రంజన్ మాట్లాడుతూ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డేనియల్ రే మాట్లాడుతూ.. రక్షణ విమానయాన రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్పారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు బీవీ పాపారావు, 16 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.