ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలి

రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని, అందుకు రైతులకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న ఉద్యాన ప్రదర్శన -2105 సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో సీఎం కేసీఆర్ ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు.

KCR Launches Horticulture programme

మన ఊరు-మన కూరగాయల స్టాల్, ఇందుకోసం వినియోగించనున్న ఆటోలకు సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి జెండా ఊపారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన పాలపిట్ట, జింక, తెలంగాణ స్తూపం, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాపును సీఎం కేసీఆర్ తిలకించారు. ప్రదర్శనలో సుమారు 160స్టాల్స్ ఏర్పాటు చేయగా.. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి సీఎం తిలకించారు.
-ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష
-తగిన ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి
-అట్టహాసంగా ప్రారంభమైన ఉద్యాన ప్రదర్శన
రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, దిగుబడి, ధరలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్త సరితారెడ్డి సీఎంకు వివరించారు. ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఉద్యానవన సాగుకు ఇస్తున్న ప్రోత్సాహంపై రైతులతో ఈ సందర్భంగా సీఎం చర్చించారు. తెలంగాణలో సాగుచేసే అన్ని ఉద్యాన పంటలతో ప్రదర్శన ఏర్పాటు చేయటం బాగున్నదని అధికారులను ప్రశంసించారు.

ఆయనవెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, టీ హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, చింతా ప్రభాకర్, బాబూమోహన్, విఠల్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డైరెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్ వెంకట్రాంరెడ్డి, ఏడీ హన్మంతరావు, మార్కెటింగ్ శాఖ ఇంచార్జి లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

రైతులు భాగస్వాములు కావాలి: మంత్రి హరీశ్
చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని, చెరువుల పునరుద్ధరణ కోసమే మిషన్ కాకతీయ చేపట్టామని. ఇందులో రైతులు పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడికతీత మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకునేందుకు ముందుకురావాలని కోరారు. రసాయన ఎరువుల వాడకం లేకుండా పూడికమట్టితో పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు.

దీంతో రైతులకు ఎకరానికి 4-5వేల పెట్టుబడి తగ్గుతుందని, 30శాతం దిగుబడి పెరగటంతో ఆదాయం వృద్ధి అవుతుందన్నారు. కాగా ఈ ప్రదర్శన ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. 160స్టాళ్లలో గ్రీన్‌హౌస్‌లో కూరగాయల సాగు, సూక్ష్మనీటి సాగు, బిందు మరియు తుంపర సేద్యం, మామిడి, జామ మొదలైన పండ్లతోటల పెంపకం, రాష్ర్టానికి అనువైన కొత్త రకాలు, సుగంధ ద్రవ్యాల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

రైతులకు ప్రాధాన్యమిస్తున్న కేసీఆర్
-వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అనాలోచిత విధానాలతో రైతులు గ్రామాల్లో నివసించే పరిస్థితి లేకుండా పోయిందని.. అందుకే రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కూరగాయల సాగు కోసం గ్రీన్‌హౌస్, పాలీ హౌస్‌తో హైదరాబాద్ పరిసరాల్లోని 100 కిలోమీటర్ల వరకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం ఇస్తున్నారని, వచ్చే ఏడాది నుంచి మిగతా ప్రాంతాల్లోనూ ఇస్తామన్నారు. సోలార్ పంపుసెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని, వారంలో కంపెనీలు వస్తున్నాయని, వాటికి ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని తెలిపారు.