అధికారుల విభజనలో కేంద్రం అలసత్వం

-145 మంది ఐఏఎస్‌లకు 60 మంది కూడా లేరు
-జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు
-టీఎస్‌యూడబ్ల్యూజే జిల్లా మహాసభలో మంత్రి హరీశ్

Harish Rao Meeting in Sangareddy01

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయి నెలలు గడుస్తున్నా అధికారుల విభజనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అధికారుల విభజన పూర్తికాకపోవడంతో పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రాష్ర్టానికి 145 మంది ఐఏఎస్‌లు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 60 మంది మాత్రమే ఉన్నారని, వారిలోకూడా 10 మందికి పైగా ఆంధ్రాకు కేటాయించబడ్డారని పేర్కొన్నారు. ఒక్కో కమిషనర్ 8శాఖలను పర్యవేక్షించాల్సిరావటంతో ఇబ్బందులు తప్పడంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో పాలన ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు.

మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఐజేయూ అనుబంధం) జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారుల విభజన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పది లేఖలు రాశామని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని మోదీని కలిసి విన్నవించినా కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం పరితపిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యదక్షుడు కేసీఆర్. ఆయన రోజూ 2 గంటలపాటు 12 దినపత్రికలను చదువుతున్నారు. పత్రికా కథనాల ఆధారంగా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలిస్తున్నారు అని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ప్రతి జర్నలిస్టుకూ పనిచేస్తున్న చోట 120 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని, హెల్త్‌కార్డులు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ విలేకరుల్లో వృత్తినైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా ప్రెస్ అకాడమీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మీడియాలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప సంచలనాల కోసం తప్పుడు కథనాలు వేయవద్దని సూచించారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులతోపాటు జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కారం కావాల్సిన అవసరముందన్నారు.

సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు నవ తెలంగాణ నిర్మాణంలో కూడా అదే స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కేరళ తరహాలో కృషి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా జర్నలిస్టులకు వేజ్‌బోర్డు అమలు చేయాలని, అందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, టీఎస్‌యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ప్రెస్ అకాడమీ సభ్యుడు అంజయ్య, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, గజ్వేల్ ప్రత్యేకాధికారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.