అదనపు విద్యుత్ కొనుగోలు చేయండి

వేసవి వాతావరణం సమీపిస్తున్న నేపథ్యంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. రానున్న వేసవిలో వ్యవసాయం, పరిశ్రమలకు కోతలు లేకుండా చూసేందుకు అదనపు విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నది. రాష్ర్టానికి అవసరమైన విద్యుత్ కొనుగోలుకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.

KCR-rewiew-on-power-crisis

– ఎంత వ్యయమైనా వెనుకాడొద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచన
– పంటలు, పరిశ్రమలకు కోతలొద్దని స్పష్టీకరణ
– రాష్ట్రంలో 800 మెగావాట్ల విద్యుత్ కొరత
– రోజూ 4-5 వేల మిలియన్ యూనిట్ల కొనుగోలు
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, తెలంగాణ జెన్‌కో చైర్మన్ డీ ప్రభాకర్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతపై అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. ప్రస్తుతం రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటున్నదని, దీనిని పూడ్చుకునేందుకు పవర్ ఎక్సేంజినుంచి 4నుంచి 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సీఎం స్పందిస్తూ కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలన్నీ పరిశీలించండి. కానీ వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై మాత్రం విద్యుత్ కొరత ప్రభావం ఉండకూడదు అని స్పష్టం చేశారు.

కేరళలోని కాయంకుళం నుంచి, తూర్పు (ఈస్టర్న్) పవర్ గ్రిడ్‌ నుంచి విద్యుత్‌ను తీసుకొచ్చుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో ఎంతటి వ్యయం జరిగినా ఫర్వాలేదని, వ్యవసాయం, పరిశ్రమల రంగాలకు విద్యుత్ సమస్యలు రాకూడదని అన్నారు. వాటిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దామరచెర్లలో ఏర్పాటుచేస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. సౌరవిద్యుత్‌పైకూడా దృష్టి కేంద్రికరించాలని అన్నారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు తగిన పరిస్థితులను, మార్గాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చూపుతున్న చొరవ, స్పల్పకాల, దీర్ఘకాల ప్రణాళికల అమలువల్ల వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై విద్యుత్ కోత ప్రభావం ఉండబోదని విద్యుత్‌శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.