Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధిలో పోటీపడుతున్నాం

-మంత్రి హరీశ్‌రావు, నేను అన్నదమ్ముల్లా కలిసిపెరిగాం
-కాలంతో పోటీపడి కాళేశ్వరంను హరీశ్ పరుగెత్తిస్తున్నారు
-15 ఏండ్లు సీఎంగా కేసీఆర్ ఉండాలి: మంత్రి కేటీఆర్
-ఆత్మహత్యల సిరిసిల్ల జిల్లాను సిరులఖిల్లాగా మార్చారు
-మంత్రి కేటీఆర్ పనితీరుతోనే ఈ ఘనత: మంత్రి హరీశ్‌రావు
-సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో పరస్పరం ప్రశంసలు

సిరిసిల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. ఒకరి పనితీరును మరొకరు కొనియాడారు. అభివృద్ధిలో మాత్రమే పోటీపడుతున్నామని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టంచేశారు. మరో 15 ఏండ్లు సీఎంగా కేసీఆర్ ఉండాలనేదే తమ కోరికని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం సైనికుల్లా పనిచేస్తామని పేర్కొన్నారు. గురువారం బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో సిరిసిల్ల నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో కొనసాగిస్తున్నానని చెప్పారు. సిద్దిపేట అభివృద్ధి వెనుక 30 ఏండ్ల శ్రమ ఉన్నదన్నారు. సిద్దిపేటలో 30 ఏండ్లలో జరిగిన అభివృద్ధిని మంత్రి కేటీఆర్ నాలుగేండ్లలోనే సిరిసిల్లలో చేస్తున్నారని అభినందించారు. రాష్ర్టానికి భారీ పెట్టుబడుల కోసం దేశవిదేశాల్లో పర్యటిస్తూనే, తన శాఖను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. సిరిసిల్లను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలిపారంటూ మంత్రి కేటీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యతలను తాము నిర్వహిస్తున్నామన్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలువ డం ఖాయమని, మెజార్టీ విషయంలోనూ పోటీపడి సిద్దిపేటను దాటేలా కార్యకర్తలంతా కృషిచేయాలని కోరారు. తాము అభివృద్ధిలో పోటీపడుతున్నట్టుగానే కార్యకర్తలు కూడా పోటీపడి ఓటింగ్‌శాతం పెరిగేలా కృషి చేయాలని కోరారు. నాలుగేండ్లలోనే అభివృద్ధిలో ఎవరూ గుర్తుపట్టలేనంత గొప్పగా సిరిసిల్ల మారిందని చెప్పారు. పట్టణాభివృద్ధితోపాటు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లు, మరోవైపు టెక్స్‌టైల్‌పార్క్ ద్వారా రానున్న రోజుల్లో సిరిసిల్ల పూర్తిగా అభివృద్ధి చెంది సిరులఖిల్లా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గత నాలుగేండ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగలేదని, ఆ ఘనత అంతా మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.

సైనికుల్లా పనిచేస్తాం: మంత్రి కేటీఆర్
మంత్రి హరీశ్‌రావు, తాను సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని స్పష్టంచేశారు. ఉద్యమకాలం నుంచి తెలంగాణ కోసమే పనిచేసిన తామిద్దరం ఒకే మంత్రి వర్గంలో పనిచేసే అవకాశం లభించిందని, ఇదంతా ప్రజలు ఇచ్చిన సువర్ణవకాశంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. లక్షలాది టీఆర్‌ఎస్ కార్యకర్తలు మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పదిహేనేండ్లపాటు రాష్ర్టానికి నాయకత్వం వహించాలన్న కోరుకుంటున్నామని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కల కోసం సైనికుల్లా పనిచేస్తామన్నారు. ఇందులో భాగంగానే కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీశ్‌రావు పరుగెత్తిస్తున్నారని పొగిడారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తవుతున్నాయన్నారు. హరీశ్‌రావు పనితీరును తమ నియోజకవర్గ అభివృద్ధికి ఆదర్శంగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో మండలాల వారీగా ముఖ్యనాయకులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటివరకు చేసిన పనులను ప్రజలకు వివరించాలని, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.