అభివృద్ధిలో అగ్రగామిగా రాష్ట్రం

-గ్యాస్ కనెక్షన్లకు రూ.300 కోట్లు కేటాయింపు: మంత్రి ఈటల
-అభివృద్ధిని యజ్ఞంలా చేస్తున్న సీఎం కేసీఆర్: మంత్రి జగదీశ్‌రెడ్డి

Etela Rajendar & jagadish reddy distriuting new gas connections to women in nakirekal

గత ప్రభుత్వాల హయాంలో అడుగడుగునా వివక్ష, అన్యాయానికి గురైన తెలంగాణ.. నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డితో, ఖమ్మం నగరంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దీపం పథకం లో భాగంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో దీపం కనెక్షన్లకు రూపాయి కూడా కేటాయించలేదని, సీఎం కేసీఆర్ రూ. 300 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారన్నారు. గతంలో తెలంగాణకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల నుంచి కేటాయించిన నిధులు రూ.10 వేల కోట్లు దాటలేదని, అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి రూ.13,500 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేసిందన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు అమావాస్య చీకట్లు తొలగిపోనున్నాయని చెప్పారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగుతున్నదని, 2014కు ముందు రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండేదో ప్రజలంతా ఇప్పటికే గుర్తించారన్నారు. 2018 చివరికల్లా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నదన్నారు.

అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్: మంత్రి తుమ్మల
సీఎం కేసీఆర్ రేయింబవళ్లు కష్టపడుతూ అభివృద్ధిని యజ్ఞంలా చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ర్‌రెడ్డి కొనియాడారు. సీఎం చేస్తున్న కృషికి పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ తో డ్పా టు అందించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం నగర పరిధిలోని అల్లిపురం, కొత్తగూడెం, పుట్టకోట, రుద్రమకోట, గోళ్లగూడెం గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, మదన్‌లాల్, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మ న్ పిడమర్తి రవి, టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఆర్జేసీ కృష్ణ, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పాల్గొన్నారు.