ఆసరా తొలి అడుగే

-మరిన్ని పథకాలతో బంగారు తెలంగాణ
-పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
-అర్హులు మిగిలుంటే దరఖాస్తు చేసుకోవచ్చు

Balka Suman

ఆసరా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పింఛన్లు అభివృద్ధిలో తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో రెండోరోజైన ఆదివారం కూడా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులు మిగిలి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు అందుతాయని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతావాది కావడంతోనే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని భావించి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఇన్నాళ్లూ సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో నీళ్లు, నిధులు, నియమకాలు ఇలా అన్నింటిలోనూ దోపిడీ జరిగిందన్నారు. స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని, రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణగా మారేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

హామీలను అమలుచేస్తున్నాం: స్పీకర్ సిరికొండ
ఆసరా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పింఛన్లు అభివృద్ధిలో తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అం దుతాయని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా శాయంపేటలో పింఛన్లను అందించి మాట్లాడారు. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రూ.వేల కోట్లను పింఛన్లకు కేటాయించారన్నారు. తల్లిదండ్రుల పోషణభారమైన కుటుంబాలకు పింఛన్ ఆసరాగా ఉంటుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో వికలాంగులకు త్వరలో కృత్రిమ అవయవాలు అందించేందుక క్యాంపు నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి మహేందర్‌రెడ్డి
పేదల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆసరా పథకం ద్వారా అందిస్తున్న పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఉప్పల్, శేరిలిగంపల్లి నియోజకవర్గాల్లో పింఛన్లను పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలోని చెరువులను అభివృద్ధి చేస్తామని, కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెండ్లిళ్లకు రూ.51 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జేసీ చంపాలాల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విమర్శలు బాబుపై చేయండి: ఎంపీ బాల్క సుమన్
పేద ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ లక్ష్యమని, పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, అనర్హులను తొలగిస్తామని స్పష్టంచేశారు. టీడీపీ హయాంలో సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి రూ. 67 కోట్లు కేటాయించిందని, 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏడాదికి రూ.750 కోట్లు కేటాయించారన్నారు.

కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి రూ.4వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. గతంలో రేషన్ బియ్యం ఒక్కరికి 4కిలోలు మాత్రమే ఇచ్చే వారని, ఇప్పుడు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పింఛన్లు రాని వారు ఉంటే ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమయితే పెద్దపల్లి నియోజకవర్గంలో ప్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసి సర్వే చేయించి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొందరు గిట్టని వారు కేసీఆర్‌పై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్‌పై విమర్శలు మానుకొని తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయాలని హితవు పలికారు.