ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ ఏకగ్రీవం

-గెలుపు ధ్రువీకరణలు అందుకున్న అభ్యర్థులు
-నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానాల్లోనే ఇక పోటీ
-స్థానిక ప్రజాపతినిధుల్లో టీఆర్‌ఎస్ వైపు మొగ్గు!

MLC-Naradasu-Laxman-Rao-&-Bhanuprasad-Rao

తొలుత వరంగల్‌లో గురువారమే ఏకగ్రీవ ఎన్నికకు శ్రీకారం చుట్టగా, తరువాత శుక్రవారం ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ స్థానాల పోటీ నుంచి ప్రతిపక్ష అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు వైదొలిగారు. శనివారం కరీంనగర్‌లోని రెండు స్థానాలకూ స్వతంత్రులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం ఆరు స్థానాలకు ఇక పోటీ లేకుండా పోయింది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో భన్వర్‌లాల్ శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ ఏకగ్రీవ ఎన్నికలను అధికారికంగా ప్రకటించారు.
ఈమేరకు వారి ఎన్నికను ధ్రువీకరిస్తూ ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు గెలుపు సర్టిఫికెట్లను అందజేశారు. వరంగల్‌లో కొండా మురళీధర్‌రావు, కరీంనగర్‌లో నారదాసు లక్ష్మణరావు, టీ భానుప్రసాదరావు, ఆదిలాబాద్‌లో పురాణం సతీష్‌కుమార్, నిజామాబాద్‌లో భూపతిరెడ్డి, మెదక్‌లో భూపాల్‌రెడ్డి ఇలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.