ఆహార భద్రత కార్డులకు బియ్యం రెడీ

-యూనిట్‌కు 6 కిలోల చొప్పున అందజేత
-రాష్ట్రంలో 97 లక్షల రేషన్‌కార్డులు
-రెండు రోజుల్లో యూనిట్ల ఎంట్రీ పూర్తి
-నేడు కలెక్టర్లతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్

Etela-Rajendar
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డులపై లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో వీటిని నిల్వ ఉంచింది. 2015 జనవరి నుంచి ఆహార భద్రత కార్డులపై ఒక్కో యూనిట్ (కార్డులో పేరు ఉన్న లబ్ధిదారుడు)కు 6 కిలోల చొప్పున అందించేందుకు మిల్లర్ల నుంచి బియ్యాన్ని ముందుగానే సేకరించింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న అన్ని రేషన్ దుకాణాలకు ఈ నెలాఖరులోగా వీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆహార భద్రత కార్డుల కోసం ప్రభుత్వం ఆదాయపరిమితిని సడలించడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించి ప్రజల నుంచి దరఖాస్తులు కోరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 97.78 లక్షల దరఖాస్తులు వచ్చా యి. విచారణలో కొందరు అనర్హులుగా తేలుతుండటంతో 40వేల నుంచి 60వేల వరకు దరఖాస్తులు అనర్హత కింద తొలగిపోనున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా సుమారు 97 లక్షల దరఖాస్తులు కార్డులకు అర్హతపొందవచ్చన్న ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయి కార్డులకు ఎంపిక చేసిన లబ్ధిదారుల సంఖ్య ప్రకారం ప్రస్తుతానికి సరిపడా బియ్యం అందుబాటులో ఉండగా, గతంలో ఉన్న డాటా ప్రకారం అవసరమైన బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు సరఫరా చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేశారు.
91.94 లక్షల రేషన్ కార్డులు గతంలో ఉండగా ఇందులో అనర్హులకు చెందిన కార్డులను పౌరసరఫరాలశాఖ తొలగించింది. కార్డుల ఏరివేత ప్రక్రియ తరువాత 80 లక్షల కార్డులు మాత్రమే మిగిలాయి. ఐతే వీటిని పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాలశాఖ ముందుగా లక్షా 16 వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పాత కార్డుల ప్రకారం యానిట్లు, కావలిసిన బియ్యాన్ని అధికారులు అంచనా వేశారు. దీని ప్రకారం 2లక్షల 47వేల యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌కు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తే లక్షా 60వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనాకు వచ్చారు. కొత్తగా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తయితే యూనిట్ల సంఖ్య పెరిగే అవకాశముంటుందని, దీని ప్రకారం 2లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం అవసరముంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తుల ఆధారంగా ఇంకా యూనిట్ల ఎంట్రీ కొనసాగుతున్నందున రెండు మూడు రోజుల్లో కార్డులు, యూనిట్ల సంఖ్యపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచార సేకరణ..
ఆహార భద్రత కార్డులపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఎస్‌వోలతో పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ పార్థసారథి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆహార భద్రత కార్డుల వెరిఫికేషన్ స్టేటస్, అవసరమైన బియ్యంతోపాటు మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు అందించే సన్నబియ్యం లభ్యతపై కూడా సమాచారం సేకరించనున్నారు. జిల్లా అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా చేపట్టవలసిన చర్యలను పౌరసరఫరాలశాఖ వేగవంతం చేస్తుంది. ఆహార భద్రత కార్డులపై అందజేసే బియ్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనైనా అందించాలనే ఆలోచనలో పౌరసరఫరాలశాఖ ఉంది. తెలంగాణ ప్రభుత్వం పేరుతో కార్డుల ముద్రణ ఇంకా పూర్తికానందున లబ్ధిదారుల పేర్లతో కూడిన జాబితా ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తారు. సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న బియ్యానికి సంబంధించిన సన్నబియ్యంపై కూడా అధికారులకు మంత్రి సూచనలు ఇచ్చే అవకాశముంది.కొన్ని జిల్లాల్లో సరిపడినంతగా సన్న బియ్యం లభ్యత లేనందున పక్క జిల్లాల నుంచి సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.