8 నుంచి పింఛన్ల పంపిణీ

ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం పెంచిన పింఛన్లను నవంబర్ 8 నుంచి అందించనుందని, నవంబర్ నెల పింఛన్ నగదురూపంలో లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39,90,197 పింఛన్ల దరఖాస్తులు రాగా.. ఇప్పటికే 50 శాతం (19,27,049 దరఖాస్తుల) పరిశీలన పూర్తయిందని చెప్పారు.

KTR review with Panchayat Raj Department

ఆహార భద్రత కార్డుల కోసం 92,06,366 దరఖాస్తులు రాగా.. వాటిలో 19,28,528 దరఖాస్తులను పరిశీలించినట్టు తెలిపారు. వచ్చే వారంలోగా మిగిలిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, నవంబర్ 8 నుంచి పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డుల జారీ అంశంపై మంగళవారం సచివాలయంలో కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ నెల పింఛన్ సొమ్ము నేరుగా లబ్ధిదారులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
-నగదు రూపంలో లబ్ధిదారులకు అందజేత
-గ్రామం యూనిట్‌గా పింఛన్ల పంపిణీ
-50 శాతం పూర్తయిన దరఖాస్తుల పరిశీలన
-కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
ఇలా చేయడంవల్ల మొదటిసారి పింఛన్లు నగదు రూపంలో అందుకున్న భావన కలుగడంతోపాటు, వారి సంక్షేమంపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని మంత్రి చెప్పారు. మొదటి నెల అనంతరం యథావిధిగా ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే కట్టుదిట్టంగా చెల్లింపులుంటాయని తెలిపారు. పెరిగిన పింఛన్ల ప్రకారం వృద్ధులకు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున నవంబర్ 8నుంచి పంపిణీకి సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు.

పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రతి నెల మూడు రోజుల్లోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామం ఒక యూనిట్‌గా పింఛన్ల చెల్లింపులు ఉండాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పింఛన్లపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికీ, అధికారులు మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వితంతువుల అర్హతపై భర్త మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఒత్తిడి తేవొద్దని కలెక్టర్లకు సూచించారు. నిరాశ్రయులైన మహిళలకు కూడా పింఛన్లు అందెలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళితోపాటు అధికారులు పాల్గొన్నారు.