42 లక్షల గొర్రెల పంపిణీ

-15.50 లక్షల గొర్రెపిల్లల పునరుత్పత్తి.. రూ.700 కోట్ల విలువైన సంపద వృద్ధి
-ప్రగతి నివేదికను విడుదలచేసిన గొర్రె – మేకల అభివృద్ధి సమాఖ్య

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న అతిపెద్ద జీవనోపాధి పథకమైన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల జీవాలను పంపిణీచేశారు. ఇప్పటివరకు పంపిణీచేసిన గొర్రెల నుంచి 15.50 లక్షల గొర్రె పిల్లల పునరుత్పత్తి జరిగి రూ.700 కోట్ల విలువైన సంపద లభించింది. గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధితోపాటు మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించడం.. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతులు చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన ఈ పథకంపై ప్రగతి నివేదికను తెలంగాణ రాష్ట్ర గొర్రెల – మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ డాక్టర్ వీ లక్ష్మారెడ్డి సోమవారం విడుదలచేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు గొల్ల, కురుమలకు 2,00,235 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.2,502 కోట్లు ఖర్చుచేయగా, ఇందులో ప్రభుత్వం వాటాగా రూ.1,877 కోట్లు, లబ్ధిదారులు తమ వాటాగా రూ.625 కోట్లు చెల్లించినట్టు లక్ష్మారెడ్డి చెప్పారు.

గొర్రెల ఆరోగ్య పరిరక్షణ కోసం యూనిట్‌కు రూ.425 చొప్పున రూ.6 కోట్లు విడుదల చేశామని, మెడికల్ కిట్స్‌తో గొర్రెల ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా స్టైలో పశుగ్రాసం పెంపకాన్ని విరివిగా ప్రోత్సహించినట్టు, అటవీ భూముల్లో గొర్రెలను మేపుకొనేందుకు సడలింపు ఇచ్చినట్టు తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా గొర్రెలకు షెడ్లు, నీటితొట్ల నిర్మాణాలకు ముమ్మర చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ పథకం పురోగతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తూ, సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం.. పకడ్బందిగా ముందుకు తీసుకెళ్లడంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చూపిన చొరవ వల్ల ప్రగతి సాధ్యమైందని లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెల యూనిట్లను అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.