రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం

-అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
-కరెంటు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి: ఎంపీ కవిత

Etela Rajendar

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కరానికి ఇంటింటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నంతో పాటు వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎంపీ కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంపట్నం, సత్తెక్కపల్లిలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు సమస్యకు ఆంధ్రా పాలకులే కారణమని విమర్శించారు.

సమన్యాయం, సమధర్మం అని మాట్లాడే చంద్రబాబు అదే నిజమైతే తన వద్ద ఉన్న గ్యాస్‌తో ఒక్క దగ్గరైనా కరెంటు ఉత్పత్తి కేంద్రం పెట్టారా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో 54 శాతం కరెంటు ఇస్తామని ఒప్పుకున్నది నిజం కాదా? ఇప్పటికైన టీటీడీపీ నేతలు కళ్లు తెరిచి చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు.

రైతే రాజు అన్న మాటను టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో నిరూపిస్తుందన్నారు. 2015-16లోగా రాష్ట్రం విద్యుత్ కోతలను అధిగమిస్తుందని తెలిపారు. మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామని, మొదటగా రూ.4,250 కోట్లను విడుదల చేశామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ కరెంటు సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే వ్యవసాయానికి కరెంటు కొరత తొలగిపోనున్నదన్నారు.

సీమాంధ్ర పాలకులు బీడీ కార్మికుల సంక్షేమానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదని, కార్మికులందరికీ ఇండ్ల నిర్మాణం, సంక్షేమానికి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎంపీపీ తేలు లక్ష్మి, జెడ్పీటీసీ జంగిలి సునీత, సర్పంచులు ఆరెళ్ల రాజాగౌడ్, నేమూరి లత, ఔట్ల రాజు, ఆర్డీవో పద్మాకర్, తహసీల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.