రూ.1000 కోట్లతో కోకాకోలా మెగాప్లాంట్

-సామాజిక కార్యక్రమాలు చేపడతాం
-సీఎం కేసీఆర్‌కు కోకాకోలా కంపెనీ ప్రతినిధుల హామీ

KCR 0008
తెలంగాణలో దేశంలోకెల్లా అతిపెద్ద ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేస్తామని అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా తెలిపింది. సోమవారం సచివాలయంలో కోకాకోలా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరియల్ ఫినాన్, సంస్థ భారత్ చీఫ్ టి.కృష్ణకుమార్ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసింది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నదని ఇరియల్ ఫినాన్, సీఎం దృష్టికి తెచ్చారు. అందులో భాగంగానే రూ.1000 కోట్లతో మెగా ఉత్పాదక ప్లాంటు ఏర్పాటు చేస్తామని ఫినాన్ తెలిపారు. అలాగే సామాజికాభివృద్ధి కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపడుతామని సీఎంకు కోకాకోలా ప్రతినిధి బృందం హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నదని, కోకాకోలా ప్రతినిధి బృందానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాలని సీఎం, అధికారులను ఆదేశించారు.