10న ఆసరా పింఛన్ల పంపిణీ

– తొలిజాబితాలో 25.68 లక్షల మంది అర్హులు
– పంచాయతీల వారీ జాబితాల వెల్లడి
– సంక్షేమం, అభివృద్ధి దిశగా మందడుగు
– జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్

KTR-Review-on-Aasara-Pensions

ఈ నెల 10 నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఎంతటి ఆర్థిక భారమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం ఆసరా పింఛన్ల పంపిణీపై జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ సమీక్షించారు. తొలి జాబితాలో 25,68, 392 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.
పంచాయతీల వారీగా జాబితాల వెల్లడించి, పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. జాబితా వెల్లడించిన తర్వాత అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కేటీఆర్ ఆదేశించారు. అర్హులందరికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన చెప్పారు. అక్టోబర్, నవంబర్ నెలల పింఛన్లు ఒకేసారి పంపిణీ చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ పింఛన్ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి పదేపదే చెప్తున్నందున.. ఈ పథకం అమలులో పరిమితులు లేవని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. సాంకేతిక సమస్యలు, పరిమితుల పేరుతో ప్రజలను ఇబ్బందుల పాలు చెయ్యొద్దు అని  ఆయన చెప్పారు.

ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవచ్చునన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వృద్ధ కళాకారులకు పింఛన్ల పంపిణీకి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదిమ తెగల జీవన ప్రమాణాల దృష్ట్యా 50 ఏండ్ల వయస్సు దాటిన వారికి ఫించన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈఓ మురళీ తదితరులు పాల్గొన్నారు.