మన పీవీకి ఘన నివాళి

– మాజీ ప్రధానిపై సీఎం, గవర్నర్ ప్రశంసల జల్లు……
– పీవీ సేవలు మరువలేనివి : నేతలు..

తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 93వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్ సహా పార్టీల కతీతంగా నేతలు పీవీకి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానిగా దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. దేశానికి పీవీ చేసిన సేవలకు భారత రత్న ఇచ్చినా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ ఎంతో మానవత్వం గల మహోన్నత వ్యక్తని ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గవర్నర్ నరసింహన్ గుర్తు చేసుకున్నారు. ఇక పీవీ జయంతి వేడుకలను నిర్వహించిన ప్రభుత్వానికి అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు.

Tribute to PV Narasimha Rao

దేశ ప్రజలకు పీవీ ఎంతో సేవచేశారు: గవర్నర్
పీవీ నరసింహరావు 93 జయంతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. దేశ ప్రజలకు పీవీ ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. అమెరికా సెనెట్‌లో పీవీ చేసిన ప్రసంగం అనిర్వచనీయమన్నారు. పీవీ ఎప్పుడు కలిసినా… బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు.

పీవీకి ఎన్ని భారతరత్నలు ఇచ్చినా తక్కువే: కేసీఆర్
ప్రభుత్వం అధికారింగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ పీవీకి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పీవీకి ఎన్ని భారత రత్నలు ఇచ్చినా తక్కువేనని కొనియాడారు. పీవీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై కాకుండా ప్రత్యేకంగా అత్యంత గౌరవం దక్కేవిధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై గుంపులో గోవిందం లాగ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయన గౌరవాన్ని తగ్గించినట్లవుతుందని కేసీఆర్ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని త్వరలోనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. పీవీ తాను నమ్మినదాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఆయనకు ఎన్ని భారతరత్నలు ఇచ్చినా తక్కువేనని కొనియాడారు.

పీవీ రచనలు, సాహిత్యంలో గొప్ప అనుబంధం ఉందన్నారు. పీవీ మరణం నన్ను ఎంతో కలిచివేసిందని గుర్తు చేసుకున్నారు. పీవీ 17 భాషల్లో నిష్ణాతులు, ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా పీవీ వ్యక్తిత్వానికి తక్కువేనన్నారు. ఆచరణలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత పీవీకే దక్కుతుందని తెలిపారు. భూసంస్కరణల చట్టాన్ని తొలిసారిగా అమలులోకి తీసుకొచ్చినారని గుర్తు చేశారు.

పీవీ ఆదర్శాలు నిరంతరం ఉండాలని, త్వరలో పీవీ పేరిట భవన్ నిర్మిస్తామని, అందులో పీవీ జ్ఞాపకాలు పదిలపరుస్తామని తెలిపారు. పీవీ విగ్రహం పెట్టాలనే ఆలోచన గత ప్రభుత్వానికి రాకపోవడం శోచనీయమన్నారు. త్వరలో మంచి ప్రదేశంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడబోయే ఓ జిల్లాకు , ఓ యూనివర్సిటీకి పీవీ పేరు పెడతామని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే… రాబోయే రోజుల్లో మరింత ఘనంగా పీవీ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు పీవీని విస్మరించాయి: సినారె
రాజనీతివేత్త పీవీని గత ప్రభుత్వాలు విస్మరించాయని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినారె అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పీవీ 93వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారింగా పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ ను సినారె అభినందించారు. 1950 నుంచి పీవీతో నాకు పరిచయం ఉంది. పీవీ బహుభాషా కోవిదుడు. 17 భాషాల్లో పీవీకి ప్రావీణ్యం. పండితులకే ఒకపట్టాన అర్థమయ్యేందుకు కష్టంగా ఉన్నా వేయి పడగలు నవలను సహస్త్ర ఫణ్ పేరుతో హిందీలోకి అనువదించిన ఘనుడు పీవీ. పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.