జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమం

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఊపందుకున్నది. బుధవారం అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు పుస్తకాల పంపిణీతోపాటు సభ్యత్వాలను నమోదు చేశారు. 27న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నేతలంతా సభ్యత్వ నమోదుపైనే దృష్టి సారిస్తారని చెప్తున్నారు. వచ్చేనెల 27న పార్టీ ప్లీనరీ సదస్సు నిర్వహణకు 15 రోజులముందే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రమంగా ఊపందుకుంటున్నది. దక్షిణాది రాష్ర్టాల్లో అత్యధిక సభ్యత్వం గల రెండో పార్టీగా రికార్డు సృష్టించింది. ఈ నెల 9న జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీంతో నాయకులు గత ఏడాది గల 51 లక్షల సభ్యత్వాన్ని మించి నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు.
27న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యత్వ నమోదుపైనే దృష్టి సారిస్తారని చెప్తున్నారు. వచ్చేనెల 27న పార్టీ ప్లీనరీ సదస్సు నిర్వహణకు 15 రోజుల ముందే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. గతేడాది 51 మందికి రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించింది. ఇలా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. దురదృష్టవశాత్తు గతేడాది వెయ్యి మంది కార్యకర్తలు మృతి చెందారు. వారి కుటుంబాలకు ప్రమాద బీమా మొత్తం అందించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబ సభ్యులు అందుకు అవసరమైన పత్రాలు తీసుకొస్తే తెలంగాణ భవన్‌లోని ఇన్సూరెన్స్ విభాగం సిబ్బంది మిగతా పని పూర్తిచేస్తుంది.