గ్రేటర్‌లో గులాబీ గుబాళించడం ఖాయం

ప్రజల హృదయాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సుస్థిరస్థానం సంపాదించుకున్నదని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు ప్రజల్లో విశ్వాసం నింపాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
– ప్రజల హృదయాల్లో టీఆర్‌ఎస్‌కు సుస్థిరస్థానం
-ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి ఈటల రాజేందర్

Etela-Rajendar-interview-with-Namasthe-Telangana

నగర ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని, గ్రేటర్‌ఎన్నికల్లో గులాబీ గుబాళించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. శనివారం అల్వాల్ పర్యటన సందర్భంగా నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..

ప్రశ్న: గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు ?
మంత్రి: ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలన్న దృఢసంకల్పంతో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు కలిగింది. మేము ఎలాంటి వ్యూహాలు అమలు చేయడంలేదు. ప్రజలకు అంతా తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నగరంలో ఇటీవలి కాలంలో చేపట్టిన పథకాలతో నిరుపేద ప్రజలకు లబ్ధి చేకూరింది.

ప్రశ్న: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు ?
మంత్రి: ప్రభుత్వం ప్రవేశపేట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అర్హులైనవారందరికీ దాదాపుగా సంక్షేమ పథకాలు ఈపాటికే అందాయి. మిగిలినవారికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. డబుల్‌బెడ్‌రూం, ఇంటింటికి నల్లాకనెక్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దీపం పథకం, మహిళాగ్రూప్‌లకు సబ్సిడీ రుణాలు అందించాం. ఈ విషయాలను గడపగడపకు వెళ్లి వివరిస్తాం. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో గుడిసెలు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సంగతి వివరిస్తాం. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూంలు నిర్మించి ఇస్తాం. 58 జీవో ద్వారా నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను క్రమబద్ధీకరించాం. గత ప్రభుత్వాలు చేయని పనులు 18 నెలల కాలంలో చేపట్టాం.

ప్రశ్న: డివిజన్లలో ప్రచారం ఎలా సాగుతున్నది ?
మంత్రి: ప్రతి డివిజన్‌లో ప్రచారం ప్రారంభించాం. కేటాయించిన డివిజన్లలోని ప్రజలను కలుస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ది పథకాలను వివరిస్తూ ముందుకు పొతున్నారు. డివిజన్లవారీగా సమీక్షలు జరుపుకొంటూ లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం. ఏకపక్షంగా ప్రజలు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీలేకుండా పోయింది. మేయర్ స్థానాన్ని గెలుచుకోవడం ఖాయమైనట్టే. నేను ఇన్‌చార్జిగా ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో 9 డివిజన్లు కైవసం చేసుకొంటాం. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న వందలకోట్ల అభివృద్ధి పనులే గెలిపిస్తాయి. తాగునీటి సమస్యకే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.