గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తాం

-పార్టీనుంచి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన మంత్రి హరీశ్‌రావు

Harish Rao

తెలంగాణ కవి గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గూడ అంజయ్యను ఆదివారం అడిక్‌మెట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన హరీశ్‌రావు పార్టీ తరపున రూ. లక్ష ఆర్థిక సాయం అందచేశారు. రాష్ట్ర ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందిని చైతన్యవంతులను చేసిన గూడ అంజయ్యను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు. ఆయన కోరుకున్న దవాఖానలో వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన కూతురు మమత చదువుతోపాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. గూడ అంజయ్య సేవలు బంగారు తెలంగాణకు కూడా ఎంతో అవసరమన్నారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ పాటలతో ప్రజల్లో పెను మార్పు తెచ్చిన గూడ అంజయ్యను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు పూస రాజు, మాజీ కార్పొరేటర్ బీ జయరాంరెడ్డి, కే సురేందర్, శ్యాంసుందర్(చిట్టి), గురుచరణ్ సింగ్ పాల్గొన్నారు. అరోగ్య పరిస్థితి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందన్నారు. తనను గుర్తించి ఆదుకుంటానని ప్రభుత్వం భరోసానిచ్చింద న్నారు. మంత్రి హరీశ్‌రావు హామీతో రాష్ట్ర పునర్నిర్మాణంలో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు.బంగారు తెలంగాణ కోసం పాటలు రాస్తానని అన్నారు. త్వరలో తన పాటలను సీడీ రూపంలో తీసుకువస్తానన్నారు.