గజ్వేల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్

-అభివృద్ధి కార్యక్రమాల మంజూరు బాధ్యత నాది
-అమలయ్యేలా చూసే బాధ్యత అధికారులది
-ప్రతి ఇంటికీ మంచినీరు అందాలి
-మరుగుదొడ్లను వినియోగించుకోవాలి
-గంగదేవిపల్లిలో పర్యటించండి
-శ్మశానవాటికలు, రోడ్లు పూర్తి చేయండి

గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ప్రగతి భవన్‌లోని జనహితలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. గజ్వేల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలై ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసే బాధ్యత తనదని సీఎం చెప్పారు. అవి అమలై ప్రజలకు ఉపయోగపడేలా చూసే బాధ్యత అధికారులది అని తెలిపారు. సమస్యల పరిష్కార బాధ్యతలను శాఖల వారీగా అదికారులకు సీఎం అప్పగించారు. ఊరికి దూరంగా, ఎత్తైన ప్రాంతాల్లోని ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ రోజూ మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించినా ఉపయోగించట్లేదన్నారు. మరుగుదొడ్ల వినియోగం పరిపూర్ణంగా జరగాలని చెప్పారు. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి ప్రజలు 25 కమిటీలు వేసుకుని గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. ఆ తరహాలో గ్రామ కమిటీలను వేసుకోవాలని సూచించారు. గంగదేవిపల్లిలో అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పారు.