ఉద్యమంలా మిషన్ కాకతీయ

సీమాంధ్రపాలకుల నిర్లక్ష్యం వల్ల ధ్వంసమైన చెరువులను పునరుద్ధరించి, వాటికి పూర్వవైభవం తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసమే మిషన్ కాకతీయ పథకాన్ని ఉద్యమంలా చేపట్టామని, ఇందులో అధికారులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, మిషన్ కాకతీయ కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర స్థాయిలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

Harish-Rao-review-on-Mission-kaktiya
-అధికారులు కీలకప్రాత పోషించాలి
-చెరువులకు పూర్వవైభవం తేవాలి
-16 నుంచి రైతు రుణమాఫీ వారోత్సవాలు
-రాష్ట్ర మంత్రులు టీ హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రంలోని మండల, డివిజన్, జిల్లా స్థాయి వ్యవసాయాధికారులంతా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ పథకాల అమలు, కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు మిషన్ కాకతీయ అమలు ఉద్దేశ్యం, దాని ఉపయోగాలు, ఇందులో వ్యవసాయాధికారుల బాధ్యత, పాత్రపై సదస్సులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రులు ప్రసంగించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగిస్తూ సమైక్య పాలనలో నాటి ప్రభుత్వాలు చెరువుల అభివృద్ధిని కుంటుపరిచి కాలువలు, నదుల ద్వారా సీమాంధ్రకు నీళ్లు తరలిపోయేలా చేశారన్నారు. వాటిని అభివృద్ది చేసి పూర్వ వైభవం తేవడంతో పాటు హరిత తెలంగాణగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46వేల చెరువులను గుర్తించి రూ. 20వేల కోట్లతో దశలవారీగా వీటిని అభివృద్ధి చేయాలని సంకల్పిం చామని చెప్పారు. మొదటి దశలో 9వేల చెరువుల పూడికతీతకు పిలిచామన్నారు.

మరోవైపు చెరువులో పూడిక మట్టికి భూసార పరీక్షలు జరి పిస్తున్నామని, ఆ మట్టి పనికివస్తుందా..? లేదా అనేది పరిశోధనలు చేసి నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఇక చెరువుల పునరుద్ధరణ వల్ల బావులతోపాటు భూగర్భ జలాల మట్టాలు బాగా పెరుగుతాయని అన్నారు. మిషన్ కాకతీయ పథకానికి ఆకర్షితు లైన 30 నుంచి 40 మంది ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపార వేత్తలు కొన్ని గ్రామాల్లో చెరువుల పూడికతీత, అభివృద్ధి కోసం దత్తత తీసుకొనేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సహా అనేక పథకాలకు ఉద్యోగులు ఎంతో సహకరించారని హరీశ్‌రావు ప్రశంసించారు. రేపు చెరువుల పునరుద్ధరణలో కూడా కీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు.

-16వ తేదీ నుంచి రుణమాఫీ వారోత్సవాలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈనెల 16వ తేదీ నుంచి రుణమాఫీ వారోత్సవాలను నిర్వహించాలని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలు అధికారులకు తెలిజేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులు ఉన్నారని, మొదటి దశలో 14వేల కోట్ల రుణమాఫీ జరిగిందని అన్నారు. అన్ని గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలను ఆహ్వనించి వారి సమక్షంలో ఈ రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ర్టాన్ని సీడ్ బౌల్‌గా విత్తన ఉత్పత్తి కేంద్రంగా చూడాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, ఆ దిశగా వ్యవసాయ పరిశోధనలు జరిగి వ్యవసాయం లాభసాటిగా మారాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రైతులకు రుణాలు ఇవ్వటంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోకవర్గం ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, ప్రొఫెసర్ జయశంర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు, ఉద్యాన శాఖ ఇంఛార్జి కమిషనర్ వెంకట్రాంరెడ్డి, అగ్రోస్ ఎండీ విష్ణు, 9 జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.